మహమ్మారి దెబ్బకు మారిన సీన్.. భారత్ గడ్డపైనే తొలిసారి తయారీ..

| Edited By: Velpula Bharath Rao

Oct 28, 2024 | 6:29 AM

Military Transport Aircraft: కోవిడ్-19 మహమ్మారి నేర్పిన పాఠమో.. లేక ప్రతి విషయంలోనూ విదేశాలపై ఆధారపడాల్సిన దుస్థితి నుంచి నేర్చిన గుణపాఠమో.. మొత్తంగా భారత్ ఇప్పుడు "స్వయం సమృద్ధి'' మంత్రాన్ని జపిస్తోంది. అనేక రంగాల్లో విదేశీ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడమే కాదు, మన అవసరాలు తీరగా మిగిలిన ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి కూడా చేరుకున్నాం.

మహమ్మారి దెబ్బకు మారిన సీన్.. భారత్ గడ్డపైనే తొలిసారి తయారీ..
Tactical Transport Aircraft
Follow us on

అయితే రక్షణ విషయంలో స్వయం సమృద్ధి ఇంకా సాధ్యం కాలేదు. రష్యా, ఇజ్రాయిల్ వంటి భారత రక్షణ అవసరాలు తీర్చే దేశాలు ప్రస్తుతం యుద్ధంలో తలమునకలై ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌కు అందించాల్సిన రక్షణ పరికరాల విషయంలోనే జాప్యం జరుగుతోంది. ఇది భారత రక్షణ సంసిద్ధతను ప్రశ్నార్థకంలో నెట్టేస్తుంది. అందుకే భారత్.. డిఫెన్స్ రంగంలోనూ ప్రైవేట్ భాగస్వామ్యంతో శరవేగంగా దూసుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఆ క్రమంలో భారత అవసరాలను తీరగా మిగిలిన వాటిని భవిష్యత్తులో విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా లేకపోలేదు. తాజాగా టాటా గ్రూపుతో కలిసి భారత రక్షణ అవసరాలు తీర్చే సీ-295 టాక్టికల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను దేశీయంగా తయారు చేస్తోంది.

సీ-295 టాక్టికల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్:

దేశ రక్షణ అవసరాల్లో యుద్ధ విమానాలతో పాటు రవాణా విమానాల అవసరం కూడా చాలా ఉంటుంది. మారణాయుధాలతో పాటు సాయుధ బలగాలను, మిలటరీ పరికరాలను ఒకచోట నుంచి మరో చోటకు తరలించడానికి ఇవి అత్యంత కీలకం. ఇందుకోసం సాధారణ రవాణా విమానాలు సరిపోవు. మిలటరీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ వంటి ప్రత్యేక విభాగాల అవసరాలకు తగినట్టుగా ప్రత్యేక ఫీచర్లు కలిగి ఉండాలి. ఈ క్రమంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సీ-295 రకం మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కంటే శక్తివంతమైన ఇంజిన్, మరింత ఎక్కువ బరువును మోసుకెళ్లే సామర్థ్యం సీ-295 సొంతం. అందుకే 6 దశాబ్దాలుగా వినియోగిస్తున్న Avro-748 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను వీటితో భర్తీ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విమానాలను తయారు చేస్తున్న యురోపియన్ మల్టీనేషనల్ బ్రాండ్ “ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్” విభాగంతో భారత రక్షణ విభాగం రూ. 21,935 కోట్ల విలువైన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా మొత్తం 56 విమానాలను ఆ సంస్థ భారత రక్షణ విభాగానికి అందించాల్సి ఉంటుంది. వీటిలో 16 విమానాలను స్పెయిన్‌‌లోని సంస్థ తయారీ కేంద్రం నుంచి నేరుగా భారత్‌కు అందించాల్సి ఉండగా, 2023 సెప్టెంబర్‌లో మొదటి C-295 టాక్టికల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ భారత్‌కు చేరింది. ఇప్పటి వరకు వడోదర (గుజరాత్)లోని 11 స్క్వాడ్రన్ యూనిట్‌లో మొత్తం 6 C-295 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. ఆగస్ట్ 2025 నాటికి 16వ విమానం భారత్ చేరుకుంటుందని ఆ సంస్థ వెల్లడించింది.

2021 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం 56 విమానాల్లో 16 విమానాలను నేరుగా తయారు చేసి అప్పంగించడంతో పాటు మరో 40 విమానాలను భారత్‌లోనే తయారు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL)తో కలిసి గుజరాత్‌లోని వడోదరలో ప్లాంట్ ఏర్పాటు చేసింది. సైనిక అవసరాల కోసం భారత దేశంలో ఏర్పాటైన తొలి ప్రైవేట్ సెక్టార్ అసెంబ్లీ లైన్ కూడా ఇదే. అక్టోబర్ 2022లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వడోదరలో ఫైనల్ అసెంబ్లీ లైన్ (FAL) ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్ నుంచి తొలి విమానం 2026 సెప్టెంబర్‌లో బయటకు రానుంది. అప్పటి నుంచి మొదలుపెట్టి 2031 ఆగస్ట్ నాటికి మొత్తం 40 విమానాలను ఇక్కడ తయారు చేస్తారు. ఆ తర్వాత ఈ ప్లాంట్ నుంచి తయారు చేసే విమానాలను విదేశాలకు సైతం ఎగుమతి చేసే అవకాశం ఉంది. తొలుత భారత రక్షణ అవసరాలు తీరిన తర్వాతనే విదేశాలకు ఎగుమతి చేసే అంశంపై భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది.

స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ అక్టోబర్ 28-30 మధ్య భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం (అక్టోబర్ 27)న వడోదరలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను సందర్శించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రధాని షెడ్రో శాంచెజ్ సంయుక్తంగా ఈ ప్లాంట్‌ను ప్రారంభించనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టాటా గ్రూప్ సంస్థల అధిపతి రతన్ టాటా మరణానంతరం ఆ సంస్థకు చెందిన ప్లాంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారు. ఇందులో తయారీ, అసెంబ్లీ, మెయింటెనెన్స్, టెస్టింగ్ సహా అన్ని సదుపాయాలు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి