Air India Crash: ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో మరో ట్విస్ట్‌… మృతదేహాలు తారుమారైనట్టు ఆరోపణలు

అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి రోజుకో ట్విస్ట్‌ వెలుగు లోకి వస్తోంది. చనిపోయిన ప్రయాణికుల మృతదేహాలు తారుమారు అయినట్టు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన ఇద్దరు ప్రయాణికులు మృతదేహాలు తారుమారైనట్టు వాళ్ల బంధువులు ఆరోపిస్తున్నారు. డీఎన్‌ఏ శాంపిల్స్‌ మ్యాచ్‌ కావడం...

Air India Crash: ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో మరో ట్విస్ట్‌... మృతదేహాలు తారుమారైనట్టు ఆరోపణలు
Air India Plane Crash

Updated on: Jul 24, 2025 | 7:20 AM

అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి రోజుకో ట్విస్ట్‌ వెలుగు లోకి వస్తోంది. చనిపోయిన ప్రయాణికుల మృతదేహాలు తారుమారు అయినట్టు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన ఇద్దరు ప్రయాణికులు మృతదేహాలు తారుమారైనట్టు వాళ్ల బంధువులు ఆరోపిస్తున్నారు. డీఎన్‌ఏ శాంపిల్స్‌ మ్యాచ్‌ కావడం లేదని వాళ్లు చెబుతున్నారు. ఎయిర్‌ ఇండియాపై న్యాయపోరాటానికి బాధిత కుటుంబాలు సిద్దమయ్యాయి. ఈ ఘటనపై కేంద్రం కూడా ఆరా తీసింది. బ్రిటన్‌ ప్రభుత్వంతో ఈ వ్యవహారంపై చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించింది.

మృతదేహాల గుర్తింపులో , డీఎన్‌ఏ పరీక్షల విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించినట్టు విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అన్ని మృతదేహాల గుర్తింపులో అత్యంత వృత్తి నైపుణ్యంతో, ఎంతో బాధ్యతతో వ్యవహరించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు. అలాగే, ఈ అంశానికి సంబంధించిన ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు తాము యూకే అధికారులతో కలిసి పనిచేస్తున్నామన్నారు. ప్రయాణికుల అవయవభాగాలు కలిసిపోవడంతో డీఎన్‌ఏ పరీక్షల్లో ఈ సమస్య వచ్చినట్టు చెబుతున్నారు. బ్రిటన్‌కు చెందిన న్యాయ సేవల సంస్థ కీస్టోన్‌ సంస్థ బాధితుల తరపున పోరాడుతోంది.

మృతుల అవశేషాలను తప్పుగా గుర్తించి.. వాటినే యూకేకు పంపించారని ‘కీస్టోన్‌ లా’ సంస్థకు చెందిన న్యాయవాది ఆరోపించారు. అసహజ మరణాలను పరిశీలించే కరోనర్‌ ఆ మృతదేహాల అవశేషాలకు తిరిగి పరీక్షలు నిర్వహించగా అసలు విషయం బయటపడిందన్నారు. . ఈ విషయాన్ని కరోనర్‌ సదరు కుటుంబానికి తెలియజేయడంతో.. అంత్యక్రియలను వాయిదా వేసుకున్నట్టు తెలిపారు. ఆ శవపేటికలోని మృతదేహం గుర్తు తెలియని వ్యక్తిదని, వారి కుటుంబ సభ్యుడిది కాదని వెల్లడించారు.

డీఎన్‌ఏ పరీక్షల తరువాత 13 మృతదేహాలను బ్రిటన్‌కు పంపించారు. వారిలో ఇద్దరి డీఎన్‌ఏ శాంపిల్స్‌ సరిపోవడం లేదని బంధువులు చెబుతున్నారు. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో 242 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బాడీ మిక్సింగ్‌పై ఇప్పటివరకు ఎయిర్‌ ఇండియా యాజమాన్యం స్పందించలేదు.