అస్సాం రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకుల వ్యవహారం కలకలం రేపుతోంది. గురువారం (మార్చి 16) జరిగిన పదో తరగతి అస్సామీ ల్యాంగ్వేజ్ క్వశ్చన్ పేపర్ లీకవ్వడంతో ఆ పరీక్షను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ ప్రభుత్వ వైఫల్యంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. రద్దైన పరీక్షకు కొత్త తేదీని ప్రకటించవల్సిందిగా అస్సాం సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (SEBA)ను కోరుతూ సీఎం శుక్రవారం రాత్రి ట్వీట్ చేశారు. దీంతో మార్చి 18న జరగాల్సిన ఇంగ్లీష్‌తో సహా ల్వాంగ్వేజ్ సబ్జెక్టుల పరీక్షలను కూడా రీషెడ్యూల్ చేసినట్లు విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు తెలిపారు. హైస్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఎగ్జాం పేపర్ లీక్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి అయిన ప్రణబ్ దత్తాను అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కుముద్ రాజ్‌ఖోవా అనే మరో ఉపాధ్యాయుడిని శుక్రవారం అరెస్టు చేసినట్లు డీజీపీ జీపీ సింగ్ వెల్లడించారు. ప్రణబ్ దత్తా ఇంటి నుంచి కాలిబూడిదైన ప్రశ్నపత్రాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించినట్లు డీజీపీ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 25 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
కాగా మార్చి 12వ తేదీన జరగాల్సిన జనరల్ సైన్స్ పేపర్ ఎగ్జాంకు 9 గంటల ముందు లీక్ అవ్వడంతో ఆ పరీక్ష తేదీని రీహెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన వారం రోజుల వ్యవధిలో మరో సబ్జెక్టు క్వశ్చన్ పేపర్ లీక్ తెరపైకి రావడం గమనార్హం. అస్సాంలోని ధేమాజీకి చెందిన మరో విద్యార్థి మ్యాథమెటిక్స్ ప్రశ్నపత్రం కూడా లీక్ అయ్యిందంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ విషయమై కూడా విచారణ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.