AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP, Telangana News Live: మోదీ సర్కార్ దీపావళి కానుక.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం..!

భారత్-పాక్‌ యుద్ధం ఒక్కటే కాదు... కేవలం తొమ్మిది నెలల్లోనే ఏడు యుద్దాలను ఆపిన ఘనత తనదే అంటూ సెల్ఫ్‌ డబ్బా కొట్టుకున్నారు ట్రంప్. గతంలో ఏ దేశ అధ్యక్షుడు, ప్రధాని ఇలాంటి పనిచేయలేదని తనకు తానే కితాబిచ్చుకున్నారు. యుద్దాలను ఆపడంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమయ్యిందన్నారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌ యుద్దం కొనసాగడానికి భారత్‌, చైనానే కారణమని పనిలో పనిగా నిందలు వేశారు.

AP, Telangana News Live: మోదీ సర్కార్ దీపావళి కానుక.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం..!
Andhra Pradesh News Telangana News India News Live Updates
Balaraju Goud
|

Updated on: Sep 24, 2025 | 6:51 PM

Share

సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవడంలో అమెరికా అధ్యక్షలవారి తర్వాతే ఎవ్వరైనా.. ఇప్పటికే తిక్కతిక్క నిర్ణయాలతో ప్రపంచానికే గత్తరలేపుతున్న ట్రంపుసారు.. మరోసారి సొంత డబ్బు కొట్టుకున్నారు. ఐక్యరాజ్యసమితి వేదికపైనే తానో ధీరుడు, సూరుడు, ప్రపంచశాంతి ధూతను అంటూ తెగ బిల్డప్‌ ఇచ్చుకున్నారు. ఇంతా చేస్తున్నా నోబెల్‌ బహుమతి ఇవ్వరా.. అంటూ రివర్స్‌ క్వశ్యన్‌ వేశారు ట్రంప్.యుద్ధాలెన్నో ఆపానంటారు.. అందరి సంగతీ తేలుస్తానంటారు.. ప్రపంచంలో ఎవరూ చేయలేనివెన్నో చేశానంటూ తనకు తానే వీరతాడు వేసుకుంటారు డొనాల్డ్ ట్రంప్. తన వ్యవహారశైలితో సెటైర్లకీ సెంటర్‌ పాయింటవుతున్న ట్రంప్.. ఐక్యరాజ్యసమితి వేదికగా పిచ్చి ప్రేలాపనలు చేసి మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. భారత్‌-పాకిస్తాన్‌ యుద్దాన్ని తానే ఆపినట్టు అక్కడా మరోసారి డబ్బాకొట్టుకున్నారు.

భారత్-పాక్‌ యుద్ధం ఒక్కటే కాదు… కేవలం తొమ్మిది నెలల్లోనే ఏడు యుద్దాలను ఆపిన ఘనత తనదే అంటూ సెల్ఫ్‌ డబ్బా కొట్టుకున్నారు ట్రంప్. గతంలో ఏ దేశ అధ్యక్షుడు, ప్రధాని ఇలాంటి పనిచేయలేదని తనకు తానే కితాబిచ్చుకున్నారు. ఐక్యరాజ్యసమితి చేయాల్సిన పనులు తాను చేస్తునట్టు తెలిపారు. యుద్దాలను ఆపడంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమయ్యిందన్నారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌ యుద్దం కొనసాగడానికి భారత్‌, చైనానే కారణమని పనిలో పనిగా నిందలు వేశారు. రష్యాకు ఈ రెండు దేశాలు పూర్తిగా సహకరిస్తున్నాయన్నారు.

మొత్తంగా… నోబెల్‌ బహుమతి కావాలనడం… భారత్‌ను మరోసారి ట్రంప్‌ ఇలా టార్గెట్‌ చేయడం చర్చనీయాంశమైంది. మొదట సుంకాల బాంబ్‌ పేల్చిన ట్రంప్‌ తరువాత హెచ్‌1 బీ వీసాల ఫీజును పెంచి భారతీయులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేశారు. ఫైనల్‌గా అంతా అమెరికా, అమెరికా పౌరుల కోసమే చేస్తున్నానని తన తీరును సమర్ధించుకోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Sep 2025 06:43 PM (IST)

    బతుకమ్మ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు

    సెప్టెంబర్ 29 న సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించే భారీ బతుకమ్మ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. సీఎం హాజరయ్యే బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయడానికి సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 29న నిర్వహించే కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డ్‌లో నమోదయ్యే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.

  • 24 Sep 2025 06:32 PM (IST)

    వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

    తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు టీటీడీ అధికారులు. కాసేపట్లో ఏపీ ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 9గంటలకు భూదేవి-శ్రీదేవి సమేత మలయప్పస్వామి…పెదశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు.

    ఇక.. నేటి నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు తిరుమల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై.. తొమ్మిదో రోజు చేపట్టే ధ్వజావరోహణంతో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. 9రోజులపాటు శ్రీవారు.. ఉదయం, సాయంత్రం సమయాల్లో వేర్వేరు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. ఇవాళ రాత్రికి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిగా శ్రీవారు పెద్ద శేషవాహనంపై ఊరేగుతారు.

  • 24 Sep 2025 06:31 PM (IST)

    తిరుపతి చేరుకున్న సీఎం చంద్రబాబు

    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి తిరుపతి చేరుకున్నారు మంత్రి లోకేష్. కాసేపట్లో తిరుమల బయల్దేరనున్నారు. సీఎం చంద్రబాబు దంపతులు, లోకేష్ కలిసి బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. సీఎం చంద్రబాబుకు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు.

  • 24 Sep 2025 05:57 PM (IST)

    కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి పంట.. గిట్టుబాటు లేక రైతుల విలవిల

    అయ్యో ఉల్లి.. ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదంటారే..! అలాంటి ఉల్లికి కష్టమొచ్చింది. గిట్టుబాటు ధర దక్కక, పతనం చెందిన ధరలతో కర్నూలు రైతులు బావురుమంటున్నారు. మద్దతుధర గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అప్పులు తెచ్చి పంటలు సాగు చేసిన రైతులు పంటను అమ్ముకోలేకపోతున్నారు. ఉల్లిసాగులో ఎకరాకు రూ. 70వేల ఖర్చువుతుంది. తెగుళ్లు, వాతావరణ మార్పులు తట్టుకుని పంటలు సాగు చేస్తున్నారు. ఇన్ని కష్టాలు భరించి చేతికొచ్చిన పంటకు సరైన ధర రావడంలేదంటున్నారు. ఉల్లికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అయినా తమకు గిట్టుబాటు ధరదక్కడంలేదని ఆక్రోషిస్తున్నారు రైతులు. ఆసహాయత, ఆగ్రహంతో ఉల్లిపంటను కాలువల్లో పారవేస్తున్నారు రైతులు. ధర రాని ఉల్లిని ఏంచేసుకొమంటారంటూ.. పంటను ఆగ్రహంతో చెత్త కుప్పల్లో పారవేస్తున్నారు రైతులు. ప్రభుత్వం ప్రకటించిన ధర ఎందుకు కొరగాదంటూ ఉల్లి పంటను పొలాల్లోనే దున్నేస్తున్నారు.

  • 24 Sep 2025 05:33 PM (IST)

    రెండు తీర్మానాలను ఆమోదించిన CWC

    పాట్నాలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు తీర్మానాలను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆమోదించింది. పార్టీ సంస్థాగత మార్పులు మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఓట్‌ చోరీపై ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌లో ఇక డీసీసీలకు గతంలో ఎన్నడు లేని విధంగా మరిన్ని అధికారాలు ఇస్తామన్నారు కేసీ వేణుగోపాల్‌. తెలంగాణతో సహా 10 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యిందన్నారు. ఓట్ల చోరీపై రాహుల్‌గాంధీ చేపట్టిన ఉద్యమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, 5 కోట్ల మంది సంతకాలు చేపట్టి అక్టోబర్‌ చివర్లో ప్రజాభిప్రాయాన్ని ఈసీకి అందచేస్తామని వేణుగోపాల్‌ తెలిపారు.

  • 24 Sep 2025 04:47 PM (IST)

    తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలే వానలు

    తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఏమాత్రం వదలడం లేదు.. గ్యాప్‌ల వారీగా విరుచుకుపడుతూ వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా.. ఏపీ, తెలంగాణకు వాయుగుండం ముప్పు ముంచుకొస్తున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం.. ఎల్లుండికి వాయుగుండంగా బలపడనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత.. 27న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఏపీపై వారం రోజుల పాటు వాయుగుండం ప్రభావం కొనసాగనుంది. 26 నుంచి 29 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణలోనూ ప్రభావం చూపించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా.. 26, 27 తేదీల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. 26న తెలంగాణలోని 18 జిల్లాల్లో పలుచోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రకటించింది. 27న ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

  • 24 Sep 2025 03:43 PM (IST)

    OG టికెట్ ధరపై హైకోర్టు షాక్..!

    ఓజీ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్.వి శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. స్పెషల్ షో కు 800 చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే స్పెషల్ షో టికెట్ల విక్రయం ముగిసింది. మరోవైపు ఓజీ సినిమా టికెట్స్‌ ఫుడ్‌ డిమాండ్‌ ఉండటంతో ఇదే అదునుగా కొందరు బ్లాక్‌ టికెట్ల దందాకు తెరలేపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఇందిరానగర్‌లో OG సినిమా టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒక్కో టికెట్‌ 2వేల 500 అమ్ముతున్నట్లు గుర్తించి… 25 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు.

  • 24 Sep 2025 03:33 PM (IST)

    మోదీ సర్కార్ దీపావళి కానుక..

    దీపావళి ముందు కేంద్ర మంత్రివర్గం గుడ్‌న్యూస్ ప్రకటించింది. రైల్వే ఉద్యోగులకు ఒక ప్రధాన బహుమతిని ఇచ్చింది . బుధవారం (సెప్టెంబర్ 24)న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్, 10.91 లక్షలకు పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌గా రూ. 1,865.68 కోట్ల చెల్లింపును ఆమోదించింది. ఈ బోనస్‌ను దీపావళికి ముందు రైల్వే ఉద్యోగులకు చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ​​​​​​​ అలాగే, పలు కీలక అంశాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బీహార్‌లోని భక్తియార్‌పూర్ -రాజ్‌గిర్ -తిలైయా రైల్వే లైన్‌ను రూ. 2,192 కోట్లతో డబుల్ లేనింగ్ చేయడానికి మోదీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బీహార్‌లోని NH-139W సాహిబ్‌గంజ్-అరెరాజ్-బెట్టియా విభాగంలో హైబ్రిడ్ యాన్యుటీ కర్వ్ నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. మొత్తం ప్రాజెక్టు పొడవు 78.942 కిలోమీటర్లు. రూ 3,822.31 కోట్లు వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు.

  • 24 Sep 2025 01:41 PM (IST)

    బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

    బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఏ అంశాల ఆధారంగా ఈ పిటిషన్ వేశారని ప్రశ్నించింది. ప్రభుత్వం ఏదైనా కాపీ ఇచ్చిందా..? న్యూస్‌ పేపర్‌లో వచ్చినా ఆర్టికల్ ఆధారమా..? అని అడిగింది. పేపర్ క్లిప్పింగ్స్‌ను బేస్ చేసుకుని పిటిషన్ వేయడం సరికాదని ఫైర్ అయ్యింది.

  • 24 Sep 2025 01:24 PM (IST)

    రెండు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

    ఏపీ అసెంబ్లీలో రెండు బిల్లులకు ఆమోదం దక్కింది. అక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ సవరణ బిల్లుతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టింది. మంత్రులు బాల వీరాంజనేయ స్వామి, అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన బిల్లులను సభ్యులు ఆమోదించారు.

  • 24 Sep 2025 01:03 PM (IST)

    శాసనమండలి నుంచి బొత్స వాకౌట్

    శాసమండలి నుంచి వైసీపీ ఎమ్మెల్సీ బొత్ సత్యనారాయణ వాకౌట్ చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కించపరిచేలా టీడీపీ ఎమ్మెల్సీభూమిరెడ్డి మాట్లాడారని బొత్స ఫైర్ అయ్యారు. దీనిని నిరసిస్తూ మండలి నుంచి వాకౌట్ చేశారు.

  • 24 Sep 2025 12:39 PM (IST)

    హైకోర్టులో టీజీపీఎస్సీకి బిగ్ రిలీఫ్

    హైకోర్టులో టీజీపీఎస్సీకి బిగ్ రిలీఫ్ దక్కింది. గ్రూప్‌1పై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్‌ చేసింది. ఈ తీర్పుతో గ్రూప్-1 ర్యాంకర్లకు ఊరట దక్కిందనే చెప్పొచ్చు. టీజీపీఎస్సీ పిటిషన్‌పై కోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా డెలికేట్ పదాలు వాడారని అభిప్రాయపడింది. తదుపరి విచారణ అక్టోబర్‌ 15కు వాయిదా వేసింది.

  • 24 Sep 2025 12:15 PM (IST)

    గ్రూప్-1 అప్పీల్‌పై విచారణ వాయిదా

    గ్రూప్-1 అప్పీల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. TGPSC అప్పీల్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రీవాల్యుయేషన్ అనేది.. సర్వీస్ కమిషన్‌ నిబంధనలు ప్రకారం ఉండాలని ఏజీ వాదనలు వినిపించారు. మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ లాంటివి.. ఏమైనా జరిగాయా అని హైకోర్టు ప్రశ్నించింది. మెయిన్స్ ఎన్నిభాషల్లో నిర్వహించారని హైకోర్టు అడిగింది. ఇంగ్లీష్‌, తెలుగు, ఉర్దూలో నిర్వహించామని ఏజీ వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న కోర్టు.. విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది.

  • 24 Sep 2025 11:49 AM (IST)

    మత్స్యకారుల సమస్యలపై స్పందించిన పవన్

    ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు.. మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఉప్పాడ వచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జీవనోపాధి మెరుగుదల, తీర ప్రాంత గ్రామాల్లో.. మౌలిక సదుపాయాల కల్పనపైనా కమిటీ దృష్టిపెడుతుందన్నారు.

  • 24 Sep 2025 11:25 AM (IST)

    జగన్ పిటిషన్‌పై విచారణ వాయిదా

    ప్రతిపక్ష హోదా విషయంలో జగన్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. స్పీకర్‌ రూలింగ్‌ కొట్టేయాలంటూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్ ఇంకా హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే.. తన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ స్పీకర్ రూలింగ్ ఇచ్చారని పిటిషన్‌లో ప్రస్తావించారు. జగన్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. విచారణను అక్టోబర్‌ 4కు వాయిదా వేసింది.

  • 24 Sep 2025 11:10 AM (IST)

    హైదరాబాద్‌లో మంత్రుల పర్యటన..

    హైదరాబాద్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. కృష్ణానగర్‌లో నాలాల దగ్గర నీటి ప్రవాహాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్‌తో పాటు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పరిశీలించారు.షేక్‌పేట్‌ ఓయూ కాలనీలో పర్యటించిన మంత్రులు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. షేక్‌పేట్ డివిజన్‌లో అభివృద్ధి పనుల వివరాలను మంత్రులకు GHMC కమిషనర్ వివరించారు.అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.

  • 24 Sep 2025 10:52 AM (IST)

    జగన్ కీలక భేటీ..

    కాసేపట్లో వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు.. వివిధ విభాగాల అధ్యక్షులతో భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం జగన్ చేయనున్నారు.‌

  • 24 Sep 2025 10:35 AM (IST)

    మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో మరొకరు అరెస్ట్

    మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఈగల్ టీమ్ మరొకరిని అరెస్ట్ చేసింది. జయప్రకాష్‌కు ఈ డ్రగ్స్‌ ఫార్ములా అమ్మిన గురువారెడ్డిని అరెస్టు చేశారు ప్రస్తుతం అతన్ని రిమాండ్‌కు తరలించారు. గురువా రెడ్డి స్కూల్ డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్‌కు అల్ప్రాజోలం తయారీ ఫార్ములాను 2 లక్షళకు అమ్మినట్లు అధికారులు గుర్తించారు. జయప్రకాష్ అరెస్ట్ తర్వాత నుంచి పరారీలో ఉన్నాడు. గురువారెడ్డిపై గతంలోను కేసులు ఉన్నట్లు గుర్తించారు..

  • 24 Sep 2025 10:20 AM (IST)

    జూబ్లీహిల్స్‌లో గెలుపు మాదే

    జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక కామెంట్స్ చేశారు కంటోన్మెంట్‌ ఉపఎన్నికలో వచ్చిన ఫలితమే జూబ్లీహిల్స్‌లో రిపీట్ అవుతుందన్నారు. బీఆర్ఎస్ ఇంకా అపోహల్లోనే బ్రతుకుతోందని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో జూబ్లీహిల్స్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. అభ్యర్థి ఎంపిక పార్టీ హైకమండ్‌ చూసుకుంటుందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అమలుచేసి తీరుతామని పొన్నం చెప్పారు.

  • 24 Sep 2025 09:55 AM (IST)

    సాయితేజ కేసులో ఐదుగురు అరెస్ట్

    సిద్ధార్థ కాలేజీ స్టూడెంట్‌ సాయితేజ సూసైడ్‌ కేస్‌లో మేడ్చల్ పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. శివకుమార్, ప్రశాంత్, రోహిత్, మురళీధర్, సాయి ప్రసాద్‌ను రిమాండ్‌కు తరలించారు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న సాయితేజ సీనియర్స్ ర్యాగింగ్ చేయడంతో మనస్థాపం చెంది ఈ నెల 21 ఆత్మహత్య చేసుకున్నాడు.

  • 24 Sep 2025 09:38 AM (IST)

    మరోసారి హైకోర్టుకు జగన్

    ప్రతిపక్ష హోదాపై మరోసారి హైకోర్టును వైసీపీ అధినేత జగన్ ఆశ్రయించారు. స్పీకర్‌ రూలింగ్‌ కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే.. తన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ స్పీకర్ రూలింగ్ ఇచ్చారని పిటిషన్‌లో జగన్ పేర్కొన్నారు. స్పీకర్ రూలింగ్‌ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించడంతో పాటు తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్‌ను ఆదేశించాలని జగన్ కోరారు. ఈ పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారించనుంది.

  • 24 Sep 2025 09:03 AM (IST)

    బీసీ రిజర్వేషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ..

    తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించడంపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదనే రాజ్యాంగ నియమాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని పిటిషనర్లు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమని, పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని వారు కోర్టును అభ్యర్థించారు.

  • 24 Sep 2025 08:34 AM (IST)

    ట్రంప్‌ దంపతులు ఎక్కగానే ఆగిన ఎస్కలేటర్‌..

    ఐక్యరాజ్యసమితి సమావేశాలకు హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,‌ ఆయన సతీమణి మెలానియాకు ఊహించని సంఘటన ఎదురైంది. సమావేశ వేదిక వద్దకు వెళ్లేందుకు వారు ఎక్కిన ఎస్కలేటర్‌ సడెన్‌గా ఆగిపోవడంతో ట్రంప్‌ దంపతులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటనను వైట్‌హౌస్‌ తీవ్రమైన భద్రతా వైఫల్యంగా పరిగణించి, దీనిపై దర్యాప్తునకు ఆదేశించింది.

  • 24 Sep 2025 08:01 AM (IST)

    విజయవాడలో మహిళపై కత్తితో దాడి

    విజయవాడ భవానిపురంలో అర్ధరాత్రి మహిళపై హత్యాయత్నం కలకలం రేపింది. అప్పారావు అనే వ్యక్తి  కత్తితో  లక్ష్మీ అనే మహిళ గొంతు కోశాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే దాడిచేసినట్టు పోలీసులు నిర్ధారించారు. మద్యం మత్తులో ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మహిళకు తీవ్ర గాయాలు అవ్వగా.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

  • 24 Sep 2025 07:48 AM (IST)

    ఒంగోలులో భూ ప్రకంపనలు

    ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. ఒంగోలు నగరంలో స్వల్పంగా భూమి కంపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ కాలేజీ ప్రాంతంలో ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ భూ ప్రకంపనల కారణంగా ఎటువంటి ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం జరగలేదు

  • 24 Sep 2025 06:56 AM (IST)

    ఈ నెల 26, 27న తెలంగాణలో భారీ వర్షాలు

    బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం కారణంగా ఈ నెల 26, 27 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 25న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, 26వ తేదీ నాటికి అది వాయుగుండంగా బలపడనుంది. ఈ వాయుగుండం 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. దీన్ని ప్రభావంతో 26న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

  • 24 Sep 2025 06:48 AM (IST)

    నొబెల్ ప్రైజ్‌ ఇవ్వాలంటున్న ట్రంప్

    భారత్-పాక్‌ యుద్ధం ఒక్కటే కాదు… కేవలం తొమ్మిది నెలల్లోనే ఏడు యుద్దాలను ఆపిన ఘనత తనదే అంటూ సెల్ఫ్‌ డబ్బా కొట్టుకున్నారు ట్రంప్. గతంలో ఏ దేశ అధ్యక్షుడు, ప్రధాని ఇలాంటి పనిచేయలేదని తనకు తానే కితాబిచ్చుకున్నారు. ఐక్యరాజ్యసమితి చేయాల్సిన పనులు తాను చేస్తునట్టు తెలిపారు

Published On - Sep 24,2025 6:43 AM