Taj Mahal 22 Rooms: ఆగ్రా లోని తాజ్‌మహల్‌లో తాళం వేసిన 22 గదుల్ని తెరవాలన్న పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు సీరియస్ అయింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే వ్యవస్థను అపహాస్యం చేయకూడదని పిటిషనర్ అయిన బీజేపీ అయోధ్య విభాగం ఇన్‌చార్జ్ రజనీష్ సింగ్‌కి తలంటు పెట్టింది. ‘‘ఇవాళ ఈ డిమాండ్ చేసే మీరు, రేపు మా చాంబర్లను కూడా తెరవాలని కోరతారు’’ అంటూ తీవ్ర స్వరంతో ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారాన్ని చరిత్రకారులకు వదిలేయాలని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. తాజ్‌మహల్ మీద పరిశోధన చేయాలంటే యూనివర్సిటీలో చేరాలని కూడా పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.
కాగా, 17వ శతాబ్ధంలో మొగల్ సామ్రాజ్య పాలకుడు షాజాహాన్ తన భార్యపై ఉన్న ప్రేమకు చిహ్నంగా తాజ్ మహల్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. అయితే, హిందూ దేవాలయాలను కూల్చేసి వాటి శిధిలాల కింద ఈ తాజ్ మహల్‌ను నిర్మించారనే వాదనలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ వాదనలను ఆధారంగా చేసుకుని.. తాజ్‌మహల్‌లో తాళం వేసిన 22 గదుల్లో దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయని రజనీష్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. రజనీష్‌పై మండిపడింది.
రోడ్డెక్కిన ఎంపీ..
ఇదిలాఉంటే ఆగ్రాలో తాజ్‌మహల్ కట్టించిన ప్రాంతం తమదేనంటూ ఓ ఎంపీ రోడ్డెక్కారు. అందుకు తగ్గ ఆధారాలు తమ పూర్వీకుల రికార్డుల్లో ఉన్నాయంటూ రాజస్థాన్ బీజేపీ ఎంపీ దియాకుమారి సంచలన ప్రకటన చేశారు. ఆ భూమి తమ కుటుంబానికే చెందిందని, షా జహాన్ దానిని స్వాధీనం చేసుకున్నాడని ఆమె అంటున్నారు. ఆ కాలంలో న్యాయ వ్యవస్థ, అప్పీల్ చేసుకునే అవకాశం లేదని.. తమ దగ్గరున్న రికార్డులను పరిశీలిస్తే.. విషయం ఏంటో స్పష్టంగా తెలుస్తుందని చెబుతున్నారు బీజేపీ ఎంపీ. అంతేకాదు.. అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సైతం ఆమె సమర్థించారు. తాజ్ మహల్‌లో 22 గదులు తెరవాలని పిటిషన్ వేశారని.. దానికి తాను మద్దతు ఇస్తానని చెప్పారు. అది తెరుచుకుంటేనే.. వాస్తవం ఏంటో అందరికీ తెలుస్తుందన్నారు. తాజ్ మహల్ కంటే ముందు అక్కడ ఏముందో తెలిసే అవకాశం ఉంది. బహుశా అక్కడ గుడి కూడా ఉండొచ్చు. మక్బరా కంటే ముందు అక్కడ ఏముందో తెలుసుకునే హక్కు అందరికీ ఉంది అంటూ ఎంపీ కామెంట్ చేశారు. అయితే తమ పూర్వీకుల రికార్డులను తాను పరిశీలించలేదని, ఆ తర్వాతే వాటిపై ఓ నిర్ధారణకు వచ్చి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటానని ఆమె అంటున్నారు.