Abortions: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అబార్షన్ మహిళల హక్కంటూ కీలక వ్యాఖ్యలు..

|

Sep 29, 2022 | 12:36 PM

అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మహిళలందరికీ అబార్షన్‌ హక్కు ఉందని..

Abortions: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అబార్షన్ మహిళల హక్కంటూ కీలక వ్యాఖ్యలు..
Supreme Court of India
Follow us on

అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మహిళలందరికీ అబార్షన్‌ హక్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. పెళ్లితో సంబంధం లేకుండా.. సురక్షితమైన అబార్షన్‌ చేయించుకునే హక్కు ఉందని తెలిపింది. పెళ్లి కాలేదన్న కారణంతో అబార్షన్‌ అడ్డుకోకూడదని.. చట్టప్రకారం సురక్షిత అబార్షన్‌ ఫర్వాలేదంటూ తీర్పు వెలువరించింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్‌ ప్రెగ్రెన్సీ కేసులో సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. 24 వారాల వరకూ MTP చట్టం ప్రకారం అబార్షన్‌కు అనుమతి ఉందని చెప్పింది. ప్రతి భారతీయ మహిళ తనకు నచ్చినది ఎంచుకునే హక్కుందని సుప్రీం కోర్టు వెల్లడించింది. వివాహిత స్త్రీలే శృంగారం చేయాలనే నిబంధన ఏమీ లేదని న్యాయస్థానం పేర్కొంది. అటు వివాహితతో భర్త బలవంతంగా శృంగారం చేస్తే.. గర్భం వచ్చినా దాన్ని మారిటల్ రేప్‌గా పరిగణించి.. అబార్షన్ చేయించుకోవచ్చునని చెప్పింది.

ఇదిలా ఉంటే.. మహిళ గర్భం విషయంలో ఇటీవల కేరళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. మహిళకు గర్భం వద్దనుకుంటే MTP యాక్ట్‌ కింద.. అబార్షన్ చేయించుకోవచ్చునని.. అందుకు భర్త అనుమతి అవసరం లేదని పేర్కొంది. ప్రెగ్నెన్సీ టైమ్‌లో తమ వైవాహిక జీవితంలో మార్పులొస్తే.. గర్భాన్ని కొనసాగించమనే హక్కు భర్తకు లేదని తేల్చి చెప్పింది. ఆరోగ్యపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అబార్షన్‌కు అనుమతి ఇవ్వాలంటూ కొట్టాయంకు చెందిన ఓ యువతి (21) కేరళ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

సదరు యువతి పెద్దలకు ఇష్టంలేని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత భర్త, అత్త నిజస్వరూపం ప్రదర్శించారు. ఆమె గర్భవతి కాగా, ఆమె ప్రవర్తనపై అతడు అనుమానాలు వ్యక్తం చేసేవాడు. అత్త కూడా వేధించసాగింది. దాంతో ఆమె పుట్టింటికి చేరింది. అయితే కడుపులో పెరుగుతున్న పిండాన్ని తొలగించేందుకు ఓ క్లినిక్‌కు వెళ్లగా, భర్తతో విడిపోయినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ, అబార్షన్‌కు తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆమె పరిస్థితిని లోతుగా పరిశీలించిన కేరళ హైకోర్టు కొట్టాయం మెడికల్ కాలేజి, లేదా ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో గానీ అబార్షన్ చేయించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పు ఆమె జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని, కాపురం కొనసాగించేందుకు భర్త ఎలాంటి ఆసక్తి చూపించలేదని కోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో, ఆమె అబార్షన్‌కు భర్త అనుమతి అవసరంలేదని కీలక తీర్పు వెలువరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..