దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన భరత ఖండంపై 2023కి ముందు.. 2024కు తర్వాత అని గర్వంగా ఎలుగెత్తి చాటే సందర్భమిది. పరమపావన మూర్తి శ్రీరామ చంద్రుడి అద్భుత ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కొత్త ఏడాదిలో శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆ నరోత్తముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. గర్భగుడిలో పాలరాతితో చేసి బంగారు పూత పూసిన 8 అడుగుల సింహాసనంపై కొలువుదీరనున్నాడు ఆ జగదభిరాముడు.
జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ.. ఆ తర్వాత గర్భగుడి దగ్గర శ్రీరామ పట్టాభిషేకం జరుపుతారు. ఆపై 48 రోజులపాటు ఆలయంలో మండల పూజలు నిర్వహిస్తారు. రామయ్య ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇచ్చే మొదటి హారతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జోథ్‌పూర్ నుంచి 108 రథాలలో దేశీ నెయ్యిని అయోధ్యకు తీసుకువచ్చారు. దాదాపు 6 క్వింటాళ్ల నెయ్యితో పాటు హవన సామగ్రిని రథాలలో తీసుకువచ్చారు. ఈ నెయ్యితోనే రామయ్యకు తొలి హారతి ఇవ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన శుభ సమయం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు రామాలయాన్ని దర్శించుకోవాలని భావిస్తున్నారు. ప్రతి రోజూ మూడు నుంచి 5 లక్షల మంది భక్తులు రాములోరిని దర్శించుకునే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన జనవరి 22న రోజున ప్రముఖులు దర్శించుకోనున్నారు. అనంతరం సామాన్య భక్తులకు ఈనెల 24 నుంచి దర్శనభాగ్యం లభించనుంది.
ఇక కోట్లాది మంది భారతీయుల దశాబ్ధాల కల నెరవేరుతోన్న సందర్భాన్ని విదేశాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న టైమ్ స్క్వేర్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని పలు దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాల్లోనూ ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..