
దేశంలో టెర్రర్ యాక్టివిటీస్ కలకలం రేపుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ అల్-ఖైదా ఉగ్రవాదులు పట్టుబడటం సంచలనం రేకెత్తిస్తోంది. భారీ ఉగ్రకుట్రను భద్రత బలగాలు భగ్నం చేశాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్-ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న నలుగురు తీవ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. ఢిల్లీ, నోయిడా, అహ్మదాబాద్, మోడాసాలో ఈ ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాదులను పట్టుకున్నారు. అరెస్టైన వారిని మొహమ్మద్ ఫైక్, మొహమ్మద్ ఫర్దీన్, సైఫుల్లా ఖురేషీ, జీషాన్ అలీగా గుర్తించారు. ఈ ఉగ్రవాదులు భారత్‌లో ప్రముఖ స్థలాలపై దాడులు చేయడానికి పన్నాగం పన్నినట్లు అధికారులు తెలిపారు.
నకిలీ కరెన్సీ వ్యాపారం నిర్వహించే ఈ నలుగురూ అల్-ఖైదా ఉగ్ర సిద్ధాంతాలను ప్రచారం చేయడం కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. ఈ సోషల్ మీడియా వేదికలు, ఆటో-డిలీట్ ఫీచర్ ఉండే అనుమానాస్పద యాప్‌లు ఉపయోగించి తమ సంభాషణలు సాగిస్తూ అల్-ఖైదా సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారు. చాలా కాలంగా వీరికి ఈ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఈ నలుగురు గుజరాత్‌లో ఉగ్రచర్యలపై చర్చలు జరుపుతున్న సమయంలో గుర్తించినట్టు ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అనుమానాస్పద చాటింగ్ సమాచారం, సోషల్ మీడియా ఖాతాలను విశ్లేషిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే పార్లమెంట్ వర్షకాల సమావేశాల వేళ.. డేంజరస్ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా టెర్రరిస్టులు పట్టుబడటం కలకలం రేపుతోంది. ఉగ్రవాదులు దేశంలో ఏమైనా దాడులకు కుట్ర పన్నారా అన్న కోణంలో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎప్పటి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు..? గతంలో జరిగిన ఏవైనా దాడుల్లో వీరికి హస్తం ఉందా అన్న కోణంలో కూపీ లాగుతున్నారు.