
న్యూఢిల్లీ, మే 14: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఛైర్మన్‌గా మాజీ డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్ మంగళవారం (మే 13) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 29తో యూపీఎస్సీ ఛైర్మన్ ప్రీతి సుదాన్ ఛైర్మన్ పదవీ కాలం ముగిసింది. దీంతో అజయ్ కుమార్‌ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అజయ్ కుమార్ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో ఆయన యూపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా నియామకమయ్యారు.
అజయ్ కుమార్ 1985 బ్యాచ్ కేరళ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన 2019 ఆగస్టు 23 నుంచి అక్టోబర్ 31, 2022 వరకు రక్షణశాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. రక్షణ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఆయన.. గతంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటు, అగ్నివీర్ పథకం, ఆత్మనిర్భర్ భారత్ చొరవలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల కార్పొరేటీకరణ వంటి పరివర్తనాత్మక రక్షణ సంస్కరణలు ఆయన పదవీకాలంలో తీసుకురావడంతో కీలక పాత్ర పోషించారు. ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖలో ఉన్నత అధికారిగా, ప్రధాని మోదీ హయాంలో UPI, ఆధార్, myGov, ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ వంటి డిజిటల్ ఇండియా ప్రాజెక్టులను అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. భారత ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఆయన జాతీయ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2012ను కూడా రూపొందించారు. అజయ్ కుమార్ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, వామపక్షాల నేతృత్వంలోని ప్రభుత్వాలతో కలిసి పనిచేశారు. భారత ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం రెండింటిలోనూ కీలక పదవులను నిర్వహించారు. ఇందులో కెల్ట్రాన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎండీగా కూడా ఉన్నారు.
ఐఏఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) వంటి వాటికి అధికారులను ఎంపిక చేయడానికి యూపీఎస్సీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహిస్తుంటుంది. ఈ కమిషన్‌లో ఛైర్మన్ సహా10 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం కమిషన్‌లో ఇద్దరు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. యూపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే వ్యక్తి గరిష్ఠంగా ఆరేళ్ల వరకు ఈ పదవిలో ఉండవచ్చు. 65 ఏళ్లు వయసు నిండేవరకు ఈ పదవిలో కొనసాగవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.