దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో విమాన రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఆంక్షలు విధించింది. తక్షణమే అమల్లోకి వచ్చే ఈ ఆంక్షలు జనవరి 26 వరకూ ఉంటాయని కేంద్ర సర్కార్ తెలిపింది. ఉదయం 10.20 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ ఎటువంటి విమానాలను అనుమతించబోమని తెలిపింది. రిపబ్లిక్ డే వేడుకలను దృష్టిలో ఉంచుకుని భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ మేరకు ఢిల్లీ విమానాశ్రయం మైక్రో బ్లాగింగ్ సైట్ X (ఇంతకుముందు ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేసింది. నోటీస్ టు ఎయిర్‌మెన్ ప్రకారం, జనవరి 19 నుండి 26వ తేదీ మధ్య 2 గంటల 15 నిమిషాల పాటు ఢిల్లీ విమానాశ్రయం నుండి ఇక్కడ ఏ ఫ్లైట్ టేకాఫ్ లేదా ల్యాండ్ అవ్వదు అంటూ రాసుకొచ్చారు.
Kind attention to all flyers ! pic.twitter.com/K9RN3n5vHX
— Delhi Airport (@DelhiAirport) January 18, 2024
దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు రెండు గంటల పాటు విమాన సేవలు నిలిచిపోనున్నాయి. ఇది ఆర్థికంగా నష్టం కలిగించినప్పటికీ భద్రతకు ప్రాధాన్యత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, బీఎస్ఎఫ్ వంటి భద్రతా బలగాల హెలికాప్టర్లు, విమానాలు లేదా గవర్నర్లు, ముఖ్యమంత్రులు ప్రయాణించే విమానాలకు మాత్రం ఎటువంటి ఆటంకం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఇక, గత కొద్ది వారాలుగా పొగమంచు కారణంగా ఢిల్లీలో వందల విమానాలు రద్దు అయ్యాయి. మరికొన్నింటిని దారిమళ్లించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…