BJP News: బీజేపీలో వారికి కీలక పదవులు.. పార్టీ ఇమేజ్‌ను పెంచడం వారితో సాధ్యమేనా?

|

Jul 10, 2021 | 2:58 PM

కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించడమో, పునర్వ్వవస్థీకరించడమో చేస్తారనుకుంటే ఏకంగా సమూల ప్రక్షాళన చేసి అందరినీ ఆశ్చర్యపర్చింది మోడీ సర్కారు. ఇప్పుడు ఉద్వాసనకు గురైన మంత్రులను ఏం చేస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది.

BJP News: బీజేపీలో వారికి కీలక పదవులు.. పార్టీ ఇమేజ్‌ను పెంచడం వారితో సాధ్యమేనా?
BJP
Follow us on

(మహాత్మ కొడియార్, టీవీ9 తెలుగు, ఢిల్లీ బ్యూరో)

కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించడమో, పునర్వ్వవస్థీకరించడమో చేస్తారనుకుంటే ఏకంగా సమూల ప్రక్షాళన చేసి అందరినీ ఆశ్చర్యపర్చింది మోడీ సర్కారు. ఇప్పుడు ఉద్వాసనకు గురైన మంత్రులను ఏం చేస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది. మంత్రి పదవి కోల్పోయిన సీనియర్ నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన తరహాలోనే పార్టీలోనూ భారీ స్థాయిలో మార్పులు, చేర్పులు చేయనున్నారని కమలదళం నేతలు చర్చించుకుంటున్నారు. ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి ఏర్పాటైన రెండేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించిన మోదీ-షా ద్వయం, ఇప్పుడు పార్టీని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మంత్రిపదవి కోల్పోయిన నేతలు అసంతృప్తికి గురవకుండా ఉండేందుకు ఇతర బాధ్యతలు అప్పగిస్తారని చర్చ జరుగుతోంది.

మంత్రివర్గంలో చేరికలు – పార్టీలో ఖాళీలు
కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అమిత్ షా, పార్టీ బాధ్యతల నుంచి తప్పుకునే క్రమంలో కొన్నాళ్లు జేపీ నడ్డాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేసి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నడ్డా తన టీమ్‌ను తయారు చేసుకున్నారు. ఈ సమయంలోనే కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రాష్ట్ర మాజీ మంత్రి డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయితే కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా పార్టీ బాధ్యతల్లో ఉన్న కొందరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. మంత్రులుగా మారిన పార్టీ నేతల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, జాతీయ ఉపాధ్యక్షురాలు అన్నపూర్ణ దేవి యాదవ్, జాతీయ కార్యదర్శి విశ్వేశ్వర్ తుడుతో పాటు జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ చంద్రశేఖర్ ఉన్నారు. పార్టీ అనుసరిస్తున్న విధానం ఒక నేత చట్టసభల్లో ప్రతినిధిగా ఉండి పార్టీ పదవిలో ఉండొచ్చుకానీ, మంత్రి పదవి పొందితే పార్టీ బాధ్యతలను వదులుకోవాల్సి ఉంటుంది. ఆ క్రమంలో ఈ నలుగురూ నిర్వహించిన స్థానాలు ఖాళీ అయినట్టుగా భావించాలి. ఇదిలా ఉంటే, జేపీ నడ్డా అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత కీలక అనుబంధ విభాగాల్లో నియమకాలు పూర్తి చేయలేదు. పదవీకాలం ముగిసినప్పటికీ, పాత నేతలే కన్వీనర్లుగా, రాష్ట్రాల ఇంచార్జులుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటివి దాదాపు అరడజను విభాగాలున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఆ విభాగాలనూ భర్తీ చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మంత్రివర్గంలో చేరిక కారణంగా ఏర్పడ్డ ఖాళీలను మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన నేతలతోనే భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా, మంత్రుల రాజీనామాలు తీసుకున్న సమయంలో “ఇప్పుడు పార్టీకి మీ సేవ అవసరం, అలాగే పార్టీ మీ అనుభవాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటోంది” అని వారితో చెప్పినట్టు తెలిసింది.

గవర్నర్ కొలువులు..
కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లోత్ విషయంలో మంత్రిపదవికి రాజీనామా తీసుకోకముందే ఆయన్ను కర్నాటక రాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే తరహాలో మిగతావారిని పార్టీలో, లేదా కొన్నాళ్ల తర్వాత పదవీకాలం ముగిసిపోయే గవర్నర్ల స్థానంలో నియమించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి దాదాపు అర డజను మంది గవర్నర్లు పదవీ విరమణ చేయబోతున్నారు. మంత్రి పదవి కోల్పోయిన నేతల్లో 70 ఏళ్లు దాటినవారిని ఈ గవర్నర్ల పోస్టుల్లో భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. లోక్‌సభ నుంచి ఎన్నికైనవారు కాక, రాజ్యసభ నుంచి ఎన్నికైనవారికే గవర్నర్ పోస్టులు ఇచ్చే అవకాశం ఉంది.

పార్లమెంటరీ బోర్డులో ఖాళీల భర్తీ
భారతీయ జనతా పార్టీలో అత్యున్నత నిర్ణయాలు తీసుకునే విభాగమే బీజేపీ పార్లమెంటరీ బోర్డు. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తరహాలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సుదీర్ఘానుభవం కలిగిన సీనియర్ నేతలే ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇందులో చాలాకాలంగా 4 ఖాళీలున్నాయి. మోదీ సర్కారులో మంత్రులుగా పనిచేసి, అనారోగ్యంతో మరణించిన మాజీ మంత్రులు సుష్మా స్వరాజ్, అనంత్ కుమార్, అరుణ్ జైట్లీలు పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా ఉన్నవారే. అలాగే మరో సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అవడంతో ఆయన స్థానం కూడా ఖాళీగా ఉంది. తాజాగా పార్లమెంటరీ బోర్డు సభ్యుడుగా ఉన్న థావర్ చంద్ గెహ్లోత్‌ను గవర్నర్‌గా నియమించడం వల్ల 5వ ఖాళీ ఏర్పడింది. దీంతో ఇప్పుడు మంత్రి పదవులు కోల్పోయినవారిలో సీనియర్ నేతలకు పార్లమెంటరీ బోర్డులో స్థానం కల్పించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రకారం సీనియర్ నాయకులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్, డా. హర్ష్ వర్ధన్ లకు పార్టీలో లేదా పార్లమెంటరీ బోర్డులో కీలక బాధ్యతలు లభించే అవకాశాలున్నాయి.

Ravi Shankar Prasad Harshvardhan Prakash Javadekar

ఎన్నికల సమీకరణాలు
ప్రభుత్వం, పార్టీ, గవర్నర్ల వ్యవస్థ వరకు జరుగుతున్న మార్పులు చేర్పులు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది తొలి అర్థభాగంలో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలుండగా, 2022 చివర్లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్నాయి. జమ్ము-కశ్మీర్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కూడా పూర్తయితే, అక్కడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ మొత్తం 8 రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో, పార్టీలో, గవర్నర్ల నియామకంలో ప్రాధాన్యత కల్పిస్తున్నారని అర్థమవుతోంది. మంత్రివర్గ విస్తరణ పూర్తైనందున, ఇకపై జరగబోయే పార్టీలో జరగబోయే మార్పులు – చేర్పుల్లో ఈ సమీకరణాలను అమలుచేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం అనేక సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. ఆయా రాష్ట్రాల్లో బూత్ స్థాయి నుంచి పార్టీని పునర్వ్యవస్థీకరిస్తూ పునరుత్తేజం నింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కసరత్తులో మంత్రిపదవి కోల్పోయిన యువ నేతలతో పాటు, మంత్రిపదవి దక్కించుకోలేకపోయిన యువ నేతలకు కూడా పార్టీలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగించేందుకు కమళనాథులు కసరత్తు చేస్తున్నారు.

Also Read..