ఇటీవల ఫిబ్రవరిలో జమ్ము కశ్మీర్‌లోని లిథియం నిల్వలు గుర్తించి దేశానికి ఓ శుభవార్త అందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా రాజస్థాన్‌లోని డేగనా అనే ప్రాంతంలో లిథియం నిక్షేపాలు కనుగొన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. గతంలో జమ్ము కశ్మీర్‌లో గుర్తించిన వాటికంటే ఇక్కడ లిథయం నిల్వలు అధికంగా ఉన్నాయని వెల్లడించారు. అలాగే ఈ లిథియం నిల్వలు భారతదేశంలో ఉన్న 80 శాతం అవసరాలను తీర్చగలవని భావిస్తున్నారు.
గతంలో కర్నాటకలో స్వల్ప స్థాయిలో లిథియం ఖనిజ నిక్షేపాలను గుర్తించగా.. ఆ తర్వాత జమ్మూకశ్మీర్, రాజస్థాన్‌లలో భారీ స్థాయిలో ఆ ఖనిజాలను గుర్తించడం విశేషం. ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించే బ్యాటరీలలో ప్రధానంగా లిథియాన్ని వాడుతారు. అయితే ఇలాంటి అరుదైన లోహా నిల్వల కోసం ప్రభుత్వం దేశంలోపల, అలాగే బయటి దేశాల్లో కూడా అన్వేషిస్తోంది. అయితే లిథియం నిల్వలు ప్రధానంగా సౌత్ అమెరికా దేశాలైన అర్జెంటీనా, బోలీవియా, చిలీ దేశాల్లో 50 శాతం వరకు కేంద్రీకృతమై ఉన్నాయి. అలాగే లిథియం శుద్ధిలో 75 శాతం చైనా అధినంలోనే ఉంది.
మరోవైపు 2030 లోగా లిథియంపై ఆధారపడి 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలను పెంచాలని భారత్ భావిస్తోంది. అయితే ఇప్పటివరకు దేశంలో అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనాల్లో కేవలం ఒక శాతం కంటే కొంచెం ఎక్కువ మాత్రమే లిథియంపై ఆధారపడిన వాహనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇండియా లిథియం కోసం చైనా పైనే ఆధారపడి ఉంది. ఇక నుంచి చైనాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని.. గల్ఫ్ దేశాల్లాగే రాజస్థాన్ కూడా అభివృద్ధి బాట పట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం