
తమిళనాడు రాజకీయాల్లో శుక్రవారం (జూన్ 5, 2026) ఒక పెను సంచలనం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ (BJP) తమిళనాడు విభాగం తీవ్ర రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై బీజేపీకి రాజీనామా చేయడంతో మొదలైన ఈ ప్రకంపనలు.. పార్టీని నిలువునా ముంచేసే స్థాయికి చేరాయి. అన్నామలై బాటలోనే నడుస్తూ తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్, రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్‌లతో పాటు మరో 14 మంది కీలక నేతలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాలు సమర్పించారు.
బీజేపీని వీడిన అనంతరం మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తామంతా అన్నామలై ప్రారంభించబోయే కొత్త రాజకీయ ఉద్యమంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా అన్నామలై నాయకత్వాన్ని నాగరాజన్ ఆకాశానికెత్తారు. “తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై అయినా, మరెవరి తప్పులనైనా నిలదీయడానికి అన్నామలై ఎప్పుడూ వెనుకాడలేదు. ఆయన ఎంతో ధైర్యవంతుడు, సమాజంలోని విభిన్న రంగాలపై లోతైన అవగాహన ఉన్న నాయకుడు. ఈ లక్షణాలే ఆయన్ను ఒక సమర్థుడైన లీడర్‌గా నిలబెట్టాయి. అందుకే మేము ఆయనతోనే నడవాలని నిర్ణయించుకున్నాం” అని నాగరాజన్ స్పష్టం చేశారు.
బరువైన హృదయంతో వీడుతున్నా: సుమతి వెంకటేష్
మరోవైపు, తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్ శుక్రవారం సాయంత్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తన రాజీనామాను అధికారికంగా ప్రకటించారు. “బరువైన హృదయంతో, నేను నా పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీతో నా సుదీర్ఘ సంబంధాన్ని ముగిస్తున్నాను” అని ఆమె పేర్కొన్నారు. ఇన్నాళ్లూ బీజేపీకి సేవ చేయడం తనకు ఎంతో గర్వకారణంగా, అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంతో పాటు జాతీయవాదం, దేశభక్తి, జాతిసేవ వంటి బీజేపీ ఆదర్శాలు తన్ను ఎంతగానో ప్రేరేపించాయని, ఆ విలువలే భవిష్యత్తులోనూ తన మార్గదర్శకాలుగా ఉంటాయని సుమతి వెంకటేష్ వెల్లడించారు. ఒకే రోజున ఇంతమంది అగ్రనేతలు తప్పుకోవడంతో తమిళనాడులో కమలం పార్టీ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
This is my humble intimation to all 👃👃👃 pic.twitter.com/mHpAtDHNml
— Sumathi Venkatesh (மோடியின் குடும்பம்) (@SumathiVenkat18) June 5, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..