Aatmanirbhar Bharat: ప్రపంచంలో రెండో అతి పెద్ద సైన్యం కలిగిన దేశం అఖండ భారత్! కానీ మనకు కావాల్సిన ఆయుధాలను సొంతంగా తయారుచేసుకోలేని దుస్థితి మనది! దేశ రక్షణకు కావాల్సిన ఆయుధాల్లో సగానికి పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ప్రపంచంలో ఆయుధాల దిగుమతిలో సౌదీ అరేబియా తర్వాత రెండో స్థానం భారత్‌దే! అయితే, ఇక, దేశీయంగా ఆయుధ ఉత్పత్తి చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో దాదాపు పది శాతం భారత్ దేశం దిగుమతి చేసుకుంటుంది. ఇటీవల చైనా గాల్వన్‌లో దురాక్రమణకు పాల్పడినప్పుడు భారత్ అత్యవసరంగా రష్యన్ యుద్ధ విమానాల కోసం ఆర్డర్లు పెట్టాల్సి వచ్చింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హుటాహుటిన రష్యాకు వెళ్లి ఆయుధాల సరఫరాపై చర్చలు జరపాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో కొంతైనా మార్పు తీసుకువచ్చి, దేశీయ ఆయుధ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో భారత ప్రభుత్వం పలు రకాల ఆయుధాల దిగుమతిపై నిషేధం విధించింది.
ఇదే క్రమంలో దేశీయ ఆయుధ పరిశ్రమకు మరింత ఊతమిచ్చే దిశగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. 108 రకాల రక్షణ ఉపకరణాల దిగుమతిపై నిషేధం విధించే ప్రతిపాదనకు ఆయన ఆమోదం తెలిపారు. ఈ జాబితాలో కొత్తతరం కార్వెట్ యుద్ధనౌకలు, గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ట్యాంకు ఇంజిన్లు, రాడార్లు వంటివి ఉన్నాయి. 101 రకాల ఆయుధాలు, సైనిక ఉపకరణాలతో కూడిన తొలి నిషేధ జాబితాను గత ఏడాది ప్రభుత్వం జారీ చేసింది. తాజాగా ఖరారైన రెండో జాబితాలోని 108 రకాల ఉపకరణాలపై ఈ ఏడాది డిసెంబరు నుంచి 2025 డిసెంబరు మధ్య దశలవారీగా ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆయుధ పరిశ్రమలతో విస్తృతంగా చర్చించాకే దీన్ని సిద్ధం చేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ తెచ్చిన ‘ఆత్మనిర్భర్ భారత్’ కింద రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి ఊతమిచ్చేందుకు రాజ్‌నాథ్ సింగ్ ఈ జాబితాకు ఆమోదం తెలిపారు’’ అని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందులోని ఆయుధాలు, విడిభాగాలను ‘రక్షణ కొనుగోళ్ల విధానం 2020’లోని నిబంధనల కింద దేశీయ సంస్థల నుంచే సేకరిస్తారు. మొదటి జాబితాలో టోవ్డ్ శతఘ్నులు, ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల స్వల్పశ్రేణి క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, తీర ప్రాంత గస్తీ నౌకలు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు, క్షిపణి ప్రయోగ యుద్ధనౌకలు, తేలియాడే డాక్, జలాంతర్గామి విధ్వంసక రాకెట్ లాంచర్లు ఉన్నాయి.
ఈ జాబితాను ప్రకటించడం ద్వారా… వచ్చే అయిదేళ్లలో స్వదేశీ రక్షణ ఉత్పత్తుల సంస్థలు వేటి తయారీపై దృష్టి పెట్టాలో ప్రభుత్వం స్పష్టంగా దిశా నిర్దేశం చేసినట్లయిందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ జాబితాలోని ఏవైనా ఆయుధాలను విదేశీ సంస్థలు భారత్‌కు విక్రయించాలనుకుంటే భారతీయ సంస్థలతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేసుకుని దేశీయంగా వాటిని తయారు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కూడా దేశీయ రక్షణ పరిశ్రమకు లబ్ధి చేకూరుతుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also… Breaking: CBSE 12వ తరగతి పరీక్షలు రద్దు.. విద్యార్ధుల ఆరోగ్యమే ముఖ్యం: ప్రధాని మోదీ