స్టాక్ మార్కెట్ (Stock Market) లో పెట్టుబడులు పెట్టాడు. లాస్ రావడంతో పెట్టిందంతా పోయింది. మరోవైపు.. అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. ఏం చేయాలో తెలియని స్థితిలో ఓ మహిళ నుంచి రూ.50వేలు తీసుకున్నాడు. డబ్బు ఇచ్చి చాలా రోజులు అవడంతో ఆమె.. డబ్బులు ఇవ్వాలని కోరింది. తన దగ్గర ఇప్పుడు లేవని అతను చెప్పడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆవేశంతో ఊగిపోయిన అతడు.. ఆ మహిళను దారుణంగా చంపేశాడు. 91సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. అంతే కాకుండా ఈ కేసును విచారిస్తున్న పోలీసులను పక్కదారి పట్టించాడు. వారు తమదైన శైలిలో విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి. కర్నాటక (Karnataka) రాజధాని బెంగళూరులోని వినాయక నగర్‌లో నివాసముంటున్న యశోదమ్మ అనే మహిళ దారుణ హత్యకు గురయ్యారు. తన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో శవమై పడి ఉన్నారన్న సమాచారంతో పోలీస్ అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 100 మందిని పైగా విచారించారు. హత్య కేసులో కీలకంగా మారిన జై కిషన్ అనే వ్యక్తిని పోలీసులు అనుమానించనప్పటికీ.. యశోదమ్మ హత్యకు గురయ్యారన్న విషయాన్ని అతనే చెప్పినట్లు పోలీసులు గుర్తించారు.
జులై 2న రాత్రి 9.30 గంటల సమయంలో యశోదమ్మ కుమారుడు రాజుకు ఫోన్ చేసి.. యశోదమ్మ రక్తపు మడుగులో పడి ఉందని, వెంటనే రమ్మని చెప్పాడు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న యశోదమ్మ కుమారుడు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా మృతదేహంపై నగలు కనిపించకపోవడంతో డబ్బు కోసమే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్ని వారాల తర్వాత.. జై కిషన్ వివిధ వ్యక్తులకు రూ.4 లక్షలు అప్పు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. అనుమానం రావడంతో అతడిని విచారించారు. విచారణలో యశోదమ్మను హత్య చేసి, ఆభరణాలు అపహరించినట్లు అంగీకరించాడు.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోయానని, చేసిన అప్పులు తీర్చేందుకు మరిన్ని అప్పులు చేశానని నిందితుడు వెల్లడించాడు. అంతే కాకుండా యశోదమ్మ బతికే ఉన్నప్పుడు ఆమె దగ్గర నుంచి రూ.50వేలు తీసుకున్నాడు. అయితే ఆ డబ్బు చెల్లించాలంటూ ఆమె అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కిషన్ ఆవేశంతో యశోదమ్మను కత్తితో 91 సార్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..