కాలం మారుతోంది.. మీరు మారండ్రా బాబూ.. మూఢ నమ్మకాలను వదిలి.. వాస్తవంలో బతకండంటా.. నెత్తి నోరు కొట్టుకుని ప్రచారం చేస్తున్నా.. కొందరిలో మార్పు రావడం లేదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లోనూ తాము ఇంకా ఉన్నామంటూ మూఢ నమ్మకాలు వికటాట్టహాసం చేస్తున్నాయి. గ్రామాలు, మారుమూల ప్రాంతాల వరకే పరిమితమయ్యాయనుకుంటే.. అవి నగరాల్లోనూ తమ ఉనికిని చాటుకుంటున్నాయి. చేతబడి, క్షుద్రపూజలు నిత్యకృత్యమయ్యారు. వీటి మాటున దాడులూ జరుగుతుండటం కలవర పెడుతోంది. తాజాగా మహారాష్ట్రలోని పుణెలో అలాంటి ఘటనే జరిగింది. భార్యకు సంతానం కలగడం లేదని భర్త, అత్తింటి వారు దారుణంగా ప్రవర్తించారు. ఆమెపై క్షుద్రపూజలు చేయించి.. అస్థికలు తినిపించారు. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన సమాజంలో వేళ్లూనుకున్న అంధ విశ్వాసాల ప్రాబల్యం ఎంతగా ఉందో స్పష్టం చేస్తోంది.
మహారాష్ట్రలోని పుణె ప్రాంతంలోని సింహగడ్ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన జరిగింది. ఓ మహిళకు పెళ్లై.. చాలా సంవత్సరాలు గడుస్తున్నా ఆమెకు సంతానం కలగలేదు. దీంతో భర్త, అత్తమామలు ఆమెను అదనపు కట్నం కోసం వేధించడం స్టార్ట్ చేశారు. పెళ్లై ఇన్నాళ్లైన ఇంకా సంతానం కలగలేదని ఆమెపై పలుమార్లు దాడికి తెగబడ్డారు. మానసికంగా, శారీరకంగా హింసించారు. ఆమెపై నరబలి, జంతుబలి చేసే మాంత్రికుడితో క్షుద్ర పూజలు చేయించారు. మహిళతో అస్థికలు తినిపించారు. కోళ్లను, మేకలను బలిచ్చారు. బాధితురాలిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. వారి ఇబ్బందులు తాళలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 8 మందిపై కేసులు నమోదు చేశారు. వీరంతా పుణెకు చెందినవారేనని పోలీసులు పేర్కొన్నారు.
కాగా.. ఈ ఘటనపై మహారాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్పర్సన్ రూపాలీ చకంకర్ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. పుణె లాంటి అభివృద్ధి చెందుతున్న నగరంలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతే కాకుండా ఘటనపై దర్యాప్తు జరిపి కమిషన్‌కు నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..