
మావోయిస్ట్ ముక్త్ భారత్ క్లైమాక్స్‌కు చేరుతోంది. మావోయిస్టుల అంతమే పంతంగా ఓ వైపు అడవుల్లో కాల్పుల మోత మోగుతుంటే మరోవైపు నిశ్శబ్ద విప్లవంలా సరెండర్ల గ్రాఫ్ పెరుగుతోంది. తాజాగా.. భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో రికార్డు స్థాయిలో 86 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి కలిశారు. కొత్తగూడెం ఐజీ చంద్రశేఖర్ సమక్షంలో సరెండరయ్యారు. వారిలో 20 మంది మహళా మావోయిస్టులు ఉన్నారు. వీళ్లంతా చత్తీస్‌గఢ్‌లో కీలక ఆపరేషన్స్‌లో పాల్గొన్న సుక్మా, బీజాపూర్ దళాలకు చెందిన వాళ్లని అధికారులు తెలిపారు.. 86 మంది మావోయిస్టులు ఒకే సారి లొంగిపోవడం సంచలనం సృష్టిస్తోంది. అయితే రానున్న రోజుల్లో మరింత మంది మావోయిస్టులు లొంగిపోతారని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే.. అటు అల్లూరి జిల్లా గాలికొండ ఏరియా కమిటీకి చెందిన 11 మంది మావోయిస్టుల ఎస్పీ అమిత్ బర్దార్ ఎదుట సరెండరయ్యారు. తెలుగు రాష్ట్రల్లో ఒకే రోజు 97 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చారు.
మరోవైపు ఉనికి ప్రశ్నర్ధకమైన క్రమంలో శాంతి చర్చలకు సిద్దమని కేంద్రానికి లేఖ రాశారు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధులు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో సీజ్ ఫైర్ ప్రతిపాదన చేశారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రతిపాదనకు అంగకరిస్తే కాల్పులు విరమిస్తామన్నారు. సుమారు 20 ఏళ్లకు మళ్లీ శాంతిచర్చల కోసం మావోయిస్టులు ప్రతిపాదన చేయడం చర్చనీయాంశంగా మారింది.
#Telangana: 86 Maoists have surrendered before local police in Bhadradri Kothagudem district.#MaoistSurrender #PeaceInitiative pic.twitter.com/pUs0tO1upY
— All India Radio News (@airnewsalerts) April 5, 2025
ఇక ఆపరేషన్ కగార్‌తో అడవి బాటలో అలజడి రేగింది. భారీ ఎన్‌కౌంటర్లతో దండకారణ్యం దద్దరిల్లింది. కాల్పుల్లో 130 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్ట్ ముక్త్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అంతకంతకూ ఉచ్చుబిగుస్తోంది. జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు పిలుపునిచ్చింది. సరెండరైన వాళ్లకు పునరావాసం, ఉపాధి ప్రొత్సాహాకాలు ప్రకటించింది. దాంతో సరెండర్ గ్రాఫ్ పెరుగుతోంది.. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా చేపట్టిన స్పూర్తి, ప్రేరణ, నిర్మాణ్, సరళ్, సంకల్పం వంటి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..