Mariamma passes away: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. రెండున్నరేళ్లకు పైగా మహమ్మారి లక్షలాది మందిని బలితీసుకుంది. కోట్లాది మంది ఈ వైరస్ బారిన పడ్డారు. కాగా.. కోవిడ్19 మహమ్మారి ప్రారంభంలో.. వైరస్ నుంచి కోలుకున్న బామ్మ తాజాగా మరణించింది. అప్పట్లో ఈ బామ్మ కరోనా నుంచి కోలుకుని.. ఎందరికో ధైర్యాన్నిచ్చి వార్తల్లో నిలిచింది. 2020 కరోనా ప్రారంభంలో వృద్ధ దంపతులు అబ్రహం థామస్, మరియమ్మ కరోనా బారిన పడి కోలుకున్నారు. అయితే.. అప్పట్లో కరోనా నుంచి కోలుకున్న ఈ వృద్ధ దంపతులు మీడియా దృష్టిని ఆకర్షించారు. అయితే.. అబ్రహం 2020 డిసెంబర్ 24న వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో మరణించగా.. తాజాగా మరియమ్మ కూడా అనారోగ్యంతో మరణించింది. సోమవారం కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని రాణిలో కన్నుమూసినట్లు కుటుంసభ్యులు తెలిపారు. మరియమ్మ వయస్సు 91. మరియమ్మ వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో మరణించారు. గత మూడు వారాలుగా తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆమె అంత్యక్రియలు మంగళవారం అయితల సెయింట్ కురియాకోస్ క్నానయ్య చర్చిలో నిర్వహించారు.
కాగా.. 2020 మార్చిలో ఇటలీ నుంచి తిరిగి వచ్చిన వారి కొడుకు, కోడలు, మనవడి నుంచి ఈ వృద్ధ దంపతులకు వైరస్ సోకింది.ఆ సమయంలో, కోవిడ్ -19ను అధిగమించడం కష్టమని, వృద్ధ దంపతుల కోలుకోవడం అంత సులభం కాదని పలువురు వైద్య నిపుణులు పేర్కొన్నారు. అయితే, కొట్టాయం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చికిత్స పొందిన దంపతులు కోలుకున్నారు. 22 రోజుల చికిత్స తర్వాత ఏప్రిల్ 3, 2020న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అప్పట్లో వారు కోలుకోవడం కేరళ ఆరోగ్య రంగానికి, ముఖ్యంగా కొట్టాయం మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు మంచి పేరొచ్చింది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి