7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రం తాజా ప్రకటనతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట లభించినట్లయ్యింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఇవాళ ఉద్యోగులకు చెల్లించే డీఏ అలవెన్సులపై కీలక నిర్ణయం తీసుకుంది. డియర్‌నెస్ అలవెన్స్(డీఏ)ను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెంచిన డీఏను 2021 జులై నెలనుంచి అమలు చేయనున్నారు. గేడాది పెంచిన డీఏను నిలిపివేస్తూ వస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ తాజాగా డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేబినెట్ నోటు విడుదల చేయనున్నారు.
కరోనా సంక్షోభం కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గడం, సాంఘీక సంక్షేమ పథకాలపై వ్యయం పెరిగిన నేపథ్యంలో గత ఏడాది కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ, డీఆర్‌లను స్తంభింపజేసింది. ఇప్పటి వరకు మూడు విడతల డీఏ పెండింగ్‌లో ఉంది. జనవరి 1, 2020 నుండి జూన్ 30, 2020 వరకు- 4%, జూలై 1, 2020 నుండి డిసెంబర్ 31, 2020 వరకు – 3%, జనవరి 1, 2021 నుండి జూన్ 30, 2021 వరకు 4% డీఏ పెండింగ్‌లో ఉంది. తాజాగా డీఏ పునరుద్ధరణతో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేతికి అందే జీతం, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీలో కూడా పెద్ద మొత్తంలో లాభం పొందే అవకాశం కనిపిస్తోంది. కాగా, పెంచిన డీఏను 2021 జులై నెలనుంచి అమలు చేయనున్నారు.
డీఏ పునరుద్ధరణ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ఎంత అదనపు మొత్తం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం.. 7వ సీపీసీ కింద లెవల్ -1 ఉద్యోగి బేసిక్ జీతం రూ .18 వేల నుంచి రూ .56,900 వరకు ఉంటుంది. ఎంట్రీ లెవల్‌లో రూ. 18,000 ప్రాథమిక వేతనం కలిగి ఉన్న ఉద్యోగి.. ప్రావిడెంట్ ఫండ్, పన్నుల తగ్గింపును పరిగణనలోకి తీసుకుంటే వారి చేతికి 1,980 రూపాయల అదనపు జీతం లభిస్తుంది. ఇక 18 వేల రూపాయలకు మించి జీతం ఉన్నవారికి.. వారి వారి జీతాలను బట్టి డీఏ వర్తిస్తుంది.
ఇదిలాఉంటే.. జనవరి 1, 2020 నుండి ప్రభుత్వం డీఏ బకాయిలను చెల్లిస్తుందో లేదో ఇంకా స్పష్టత రాలేదు. ఈ బకాయిల చెల్లింపు ఖజానాపై అధిక భారం పడనుంది. ఉదాహరణకు లెవల్-1 ఉద్యోగికి లభించే కనీస బకాయి రూ. 23,760.(6 నెలలకు రూ .18,000లో 4%, 6 నెలలకు రూ .18,000 లో 7%, 6 నెలలకు రూ .18,000 లో 11%). అదేవిధంగా, అన్నిరకాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల బకాయి మొత్తాన్ని కలిపితే.. అది కేంద్ర ప్రభుత్వానికి పెద్ద భారంగా మారనుందనే చెప్పాలి.
Read also:
Weather Warnings: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు: హైదరాబాద్ వాతావరణ శాఖ
Corona Virus: మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు..ఆ రాష్ట్రంలో మళ్ళీ పూర్తి స్థాయి లాక్ డౌన్
ENG vs PAK: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రికార్డులను బద్దలు కొట్టిన పాకిస్తాన్ కెప్టెన్..!