First class student locked in classroom for 18 hours: స్కూల్ యాజమన్యం నిర్లక్ష్యం కారణంగా ఒకటో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలిక క్లాస్ రూంలో చిక్కుకుపోయింది. క్లాస్ రూంకు తాళం వేసే ముందు గదులను తనిఖీ చేయకుండా తాళం వేసుకువెళ్లిపోయారు. బుధవారం (సెప్టెంబర్ 21) ఉదయం తిరిగి పాఠశాలను తెరవగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని గున్నౌర్ తహసీల్‌లోని ధనరి పట్టిలోని ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలిక 18 గంటల పాటు తాళం వేసిన గదిలో చిక్కుకుపోయింది. ఐతే స్కూల్ సిబ్బంది ఎవరూ ఈ విషయాన్ని గమనించలేదు. మంగళవారం స్కూల్ నుంచి బాలిక ఇంటికి చేరుకోకపోవడంతో, బాలిక అమ్మమ్మ స్కూల్‌కు చేరుకుని తనిఖీ చేయగా అక్కడ పిల్లలెవ్వరూ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయింది. దీంతో ఆందోళన చెందిన బాలిక కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం 8 గంటలకు పాఠశాల తెరిచి చూడగా బాలిక రాత్రంతా క్లాస్ రూంలో చిక్కుకున్న విషయం వెలుగులోకొచ్చింది. స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన జరిగిందని, స్కూల్ వేళలు ముగిసిన తర్వాత టీచర్లు, ఇతర సిబ్బంది క్లాస్ రూంలను పరిశీలించలేదని, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం బాలిక క్షేమంగా ఉన్నట్లు ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోప్ సింగ్ తెలిపారు.