
సిక్కింలోని నామ్‌చి జిల్లాలోని ఎన్హెచ్‌పీసీ తీస్తా స్టేజ్-VI హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణంలో తీవ్ర విషాదం వెలుగుచూసింది. నిర్మాణ పనులు కొనసాగుతున్న వేళ ఒక్కసారిగా మిథేన్ వాయువు పేలిపోవడంతో కొండచరియలు విరిగిపడి.. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 18 మందికి పైగా కార్మికులు సొరంగం లోపలే చిక్కుకుపోయారు. సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. అయితే పేడుడు దాటికి సొరంగం ప్రవేశ మార్గం పూర్తిగా మూసుకుపోవడంతో లోపల ఉన్నవారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
అసలు ఏం జరిగింది?
అయితే సొరంగంలో 1.5 కిలోమీటర్ల లోతులో భూగర్భ శిలల నుంచి సహజంగా వెలువడిన మిథేన్ గ్యాస్ పెద్దమొత్తంలో పేరుకుపోయిందని.. అక్కడ పేరుకుపోయిన ఈ విషవాయువును బయటకు పంపేందుకు సిబ్బంది ప్రయత్నిస్తుండగా ఈ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ పేలుడి ధాటికి విరిగిన కొండచరియలు.. ప్రవేశ ద్వారం మోత్తాన్ని కమ్మేశాయని.. దీంతో రెస్క్యూ ఆపరేషన్ సైతం సవాల్‌గా మారిందని తెలిపారు.
ఈ ప్రమాద సమయంలో NHPC సిబ్బందితో సహా మొత్తం 25 మంది కార్మికులు లోపలే ఉన్నారని.. ప్రమాదం జరిగినట్టు సోమవారం మధ్యాహ్నం 3:40 గంటల ప్రాంతంలో జిల్లా యంత్రాంగానికి సమాచారం రావడంతో వెంటనే NDRF, SDRF, అగ్నిమాపక, పోలీస్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు.
సవాల్‌గా మారిన రెస్క్యూ
అయితే ప్రమాదం జరిగిన ప్రదేశం చాలా ఇరుకుగా ఉండడం, లోపల మొత్తం చీకటిగా ఉండడం, అదే సమయంలో అక్కడ ప్రమాదకర స్థాయిలో ఉన్న మిథేన్ గ్యాస్ ఉండడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ అనేది పెద్ద సవాల్‌గా మారిందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయని.. తొలుత చిక్కుకున్న వారిని కాపాడేందుకు వెళ్లిన ఫైర్ సిబ్బంది ఊపిరాడక అనారోగ్యానికి గురయ్యారని.. అందుకే తొలి ప్రయత్నాన్ని నిలిపివేసినట్టు తెలిపారు.
రంగంలోకి ప్రత్యేక బృందాలు
పరిస్థితి తీవ్రతను బట్టి, ప్రత్యేకంగా గ్యాస్ రక్షణ పరికరాలు కలిగిన నిపుణుల బృందాన్ని పశ్చిమ బెంగాల్ నుంచి రప్పించామని.. అలాగే పాక్యోంగ్, సిలిగురి ప్రాంతాల నుంచి NDRF 2వ బెటాలియన్‌కు చెందిన అదనపు బలగాలు ప్రాజెక్ట్ ప్రాంతానికి చేరుకున్నాయి. ఎలాగైన లోపల చిక్కుకున్న 18 మంది కార్ములకు బయటలకు తీసుకొచ్చే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నట్టు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.