ఆరేళ్ల చిన్నారికి గుండెపోటు.. బడిలో ఆడుకుంటూ కుప్పకూలిన ఒకటో తరగతి బాలుడు! కాసేపటికే ఘోరం

ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న 6 ఏళ్ల ప్రభుత్వ బడిలో ఆడుకుంటూ అకస్మాత్తుగా కుప్పకూలాడు. పాఠశాల అనంతరం అస్వస్థతకు గురైన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటే మరణానికి కారణమని వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు..

ఆరేళ్ల చిన్నారికి గుండెపోటు.. బడిలో ఆడుకుంటూ కుప్పకూలిన ఒకటో తరగతి బాలుడు! కాసేపటికే ఘోరం
First Class Student Died Of Heart Attack

Updated on: Jun 16, 2026 | 6:40 AM

శివమొగ్గ, జూన్‌ 16: ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా కుప్పకూలిన ఆరేళ్ల బాలుడు చికిత్స అందించేలోగా ప్రాణాలు కోల్పోయాడు. బాలుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. కర్నాటకలోని శివమొగ్గ జిల్లా సాగర తాలూకాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుడు కొడనవల్లి గ్రామానికి చెందిన త్రిలోక్ జైన్ (6)గా గుర్తించారు. త్రిలోక్‌ జూన్ 1న బడిలో ఒకటో తరగతిలో చేరాడు.

శనివారం సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం త్రిలోక్ ఇంటికి వెళ్లేందుకు ఆటస్థలంలో నిలబడి ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఉపాధ్యాయులు అతడి వద్దకు చేరుకుని ముఖంపై నీళ్లు చల్లి ప్రథమ చికిత్స అందించారు. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన త్రిలోక్ తనకు బాత్రూంకి వెళ్లాలని ఉందని చెప్పడంతో స్నేహితులు అతడిని బాత్రూంకి తీసుకెళ్లారు. అయితే చాలా సేపైనా బయటకు రాకపోవడంతో పాఠశాల సిబ్బంది వెళ్లి చూడగా, మరుగుదొడ్డి లోపల త్రిలోక్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అతడిని సమీపంలోని ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకెళ్లగా.. అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. అనంతరం అంబులెన్స్ కోసం ప్రయత్నించినప్పటికీ సమయానికి రాకపోవడంతో ప్రైవేట్ వాహనంలో కుందాపుర ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే త్రిలోక్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి

త్రిలోక్ తండ్రి గౌతమ్ జైన్, తల్లి శిల్ప. శిల్ప గత ఎనిమిదేళ్లుగా అదే ప్రభుత్వ పాఠశాలలో అతిథి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. బాలుడికి పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆదివారం కొడనవల్లి గ్రామంలో త్రిలోక్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. బాలుడి మరణానికి గుండెపోటే కారణమని గుర్తించారు.

Follow Us