AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM GatiShakti: వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి సాధించిన విజయాలు ఇవే..

ఒకప్పుడు రోడ్డు పూర్తయ్యాక పైప్‌లైన్ల కోసం తవ్వడం, రైల్వే పనుల కోసం ప్రాజెక్టులు ఏళ్ల తరబడి ఆగిపోవడం చూసేవాళ్లం. కా, ఆ పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గేమ్ ఛేంజర్ ప్లాన్ పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. ప్రారంభమై ఐదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ మెగా ప్లాట్​ఫారమ్.. కేవలం ప్రాజెక్టుల మ్యాపింగ్‌కే పరిమితం కాకుండా దేశ రవాణా ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

PM GatiShakti: వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి సాధించిన విజయాలు ఇవే..
5 Years Of Pm Gatishakti
Krishna S
|

Updated on: Oct 12, 2026 | 9:14 PM

Share

భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే ప్రయాణంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన చోదక శక్తిగా మారింది. గతంలో ఒక రోడ్డు వేసిన తర్వాత పైప్‌లైన్ల కోసమో, రైల్వే లైన్ల కోసమో మళ్లీ తవ్వకాలు జరపడం వల్ల సమయం, ప్రజాధనం భారీగా వృథా అయ్యేది. ఈ లోపాలను సరిదిద్ది.. విభాగాలు, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని తీసుకువచ్చే లక్ష్యంతో అక్టోబర్ 13, 2021న కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ నేటితో ఐదేళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. కేవలం మౌలిక వసతుల మ్యాపింగ్ వేదికగా మొదలైన ఈ ప్రాజెక్ట్, నేడు దేశవ్యాప్తంగా సమీకృత ప్రణాళికా రూపకల్పన విధానంగా అవతరించింది.

58 కేంద్ర విభాగాలు.. 36 రాష్ట్రాలు – కేంద్రపాలిత ప్రాంతాలు

ప్రస్తుతం పీఎం గతిశక్తి పరిధిలోకి 58 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు రావడంతో పాటు దేశంలోని అన్ని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేరాయి. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, జలమార్గాలు, విమానాశ్రయాలు, మాస్ ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్ అనే ఏడు కీలక రంగాలను సమన్వయం చేస్తూ ఈ ప్రాజెక్ట్ సాగుతోంది. జీఐఎస్ ఆధారిత వేదికపైకి ఇప్పటివరకు 23,493 డేటా లేయర్లను అనుసంధానించారు. దీని ద్వారా భారత్‌మాల, సాగర్‌మాల, ఉడాన్, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ వంటి కీలక పథకాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి ప్రాజెక్టులకు అనుమతులు, భూసేకరణ వేగవంతం చేస్తున్నారు.

రూ.18.66 లక్షల కోట్ల ప్రాజెక్టుల పరిశీలన..

నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ గణాంకాల ప్రకారం.. 2026 ఆగస్టు 11 నాటికి దాదాపు రూ.18.66 లక్షల కోట్ల విలువైన 396 మెగా మౌలిక వసతుల ప్రాజెక్టులను మూల్యాంకనం చేశారు. వీటిలో ఇప్పటికే 256 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు కాగా, 198 ప్రాజెక్టులు ప్రస్తుతం శరవేగంగా నిర్మాణ పనుల్లో ఉన్నాయి. రవాణా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ – లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ అథారిటీ రూ.500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యయమయ్యే ప్రాజెక్టులను సాంకేతిక పరిశీలన చేయడంతో పాటు నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ మాస్టర్ ప్లాన్‌ను పర్యవేక్షిస్తుంది. అలాగే ఫాస్టాగ్, వాహన్, జీఎస్టీ ఈ-వే బిల్లుల డేటాతో నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ డేటా రిపోజిటరీని సిద్ధం చేస్తోంది.

గతిశక్తితో క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలు..

పుణె-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే (699 కి.మీ): 2027-28 నాటికి పూర్తికానున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే మహారాష్ట్ర, కర్ణాటకలోని పారిశ్రామిక క్లస్టర్లను కలుపుతుంది. గతిశక్తి ప్లాట్‌ఫారమ్ విశ్లేషణ ద్వారా ప్రాజెక్ట్ అలైన్‌మెంట్‌ను మార్చడంతో అటవీ భూముల నష్టం 19 శాతం తగ్గింది. ప్రయాణ సమయం 7-8 గంటలు తగ్గడమే కాకుండా ఏటా 16 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా కానుంది.

జోగిఘోపా లాజిస్టిక్స్ పార్క్: ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్డు, రైలు, జలమార్గాలను అనుసంధానించేలా బ్రహ్మపుత్ర నది ఒడ్డున నిర్మిస్తున్నారు. ధుబ్రి-ఫుల్బరి మధ్య వంతెన ద్వారా ప్రయాణ దూరం 205 కిలోమీటర్ల నుంచి కేవలం 20 కిలోమీటర్లకు, సమయం 7 గంటల నుంచి 30 నిమిషాలకు తగ్గనుంది.

లడఖ్ – హర్యానా గ్రీన్ ఎనర్జీ కారిడార్: 13 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని గ్రిడ్‌కు అనుసంధానించేలా పాంగ్ (లడఖ్) నుండి కైతాల్ (హర్యానా) వరకు 480 కి.మీ హై-వోల్టేజ్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది 2029-30 నాటికి అందుబాటులోకి రానుంది.

రవాణా, లాజిస్టిక్స్ రంగంలో నైపుణ్యం పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన గతిశక్తి విశ్వవిద్యాలయ ద్వారా ఇప్పటివరకు 2.4 లక్షల మందికి పైగా అధికారులకు ప్రత్యేక శిక్షణ అందించారు. అంతేకాకుండా, ప్రైవేట్ రంగ మౌలిక ప్రాజెక్టుల కోసం సైతం సురక్షితమైన డేటా యాక్సెస్‌ను కల్పిస్తున్నారు. పీఎం గతిశక్తి అమలుతో ప్రాజెక్టుల జాప్యం తగ్గి, వ్యయం ఆదా అవ్వడంతో పాటు దేశ లాజిస్టిక్స్ సామర్థ్యం అంతర్జాతీయ ప్రమాణాల దిశగా దూసుకుపోతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Follow Us