మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
చిన్నప్పటి నుంచి గుర్రాలంటే ఎంతో ఇష్టపడే వృద్ధురాలు.. జీవిత చరమాంకంలో వాటిని మరోసారి దగ్గరగా చూడాలని కోరుకున్నారు. అయితే, ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమెకు గుర్రపు స్వారీ చేసే పరిస్థితి లేదు. దీంతో కనీసం గుర్రాలను దగ్గరగా చూడాలని ఆశపడటంతో ఆమె కోరిక గురించి తెలుసుకున్న హాస్పిస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు కలిసి ఓ అద్భుత ఏర్పాటుచేశారు.

ఇంగ్లండ్‌లోని వెస్ట్ సస్సెక్స్ ప్రాంతానికి చెందిన డెనిస్ లీకి చిన్నప్పటి నుంచే గుర్రాలంటే ఎంతో ఇష్టం. జీవితమంతా గుర్రపు స్వారీ చేసిన డెనిస్.. వికలాంగులకు గుర్రపు స్వారీ నేర్పించే అసోసియేషన్ లో స్వచ్ఛందంగా సేవలందించారు. అయితే, ఆమెకు ప్రాణాంతక క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో గుర్రపు స్వారీ చేయలేని పరిస్థితి. హాస్పిస్ కేంద్రంలో ఆమె చికిత్స, సంరక్షణ పొందుతున్నారు. జీవితంలో చివరి రోజులు సమీపిస్తున్నా ఆమెకు గుర్రాలపై ప్రేమ ఏ త్రం తగ్గలేదు.
అమ్మ చివరి కోరిక తీర్చాలని కుమార్తె ప్రయత్నం
తన తల్లి గుర్రాలను ఎంతగా ప్రేమిస్తుందో తెలిసిన కుమార్తె జోవాన్.. ఆమె చివరి కోరికను నెరవేర్చాలని నిర్ణయించింది. గుర్రాలను దగ్గరగా చూసి, వాటిని తాకాలనే తన తల్లి కోరికను నెరవేర్చేందుకు స్థానిక ఫేస్‌బుక్ కమ్యూనిటీ గ్రూపుల్లో సహాయం కోరింది. ఆమె పెట్టిన పోస్ట్ స్థానిక గుర్రాల యజమాని కెర్రీ సాండర్స్ దృష్టికి వెళ్లింది. డెనిస్‌ను సంతోషపెట్టేందుకు తన దగ్గరున్న రెండు పోనీలను హాస్పిస్ కేంద్రానికి తీసుకొచ్చారు.
మంచం దగ్గరకు గుర్రాలు.. ఆనందంతో ఉప్పొంగిన డెనిస్!
రెండు పోనీలు హాస్పిస్ కేంద్రానికి చేరుకున్నాక.. వాటిని డెనిస్ మంచం దగ్గరకు తీసుకువచ్చారు. తనకు ఎంతో ఇష్టమైన గుర్రాలు కళ్లముందు కనిపించడంతో ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. గుర్రాలు తమ తలలను ఆమెకు దగ్గరగా తీసుకురాగా.. ఆమె వాటిని ఆప్యాయంగా చేతులతో నిమిరారు. గుర్రాల శ్వాసను తన చేతిపై అనుభూతి చెందాలన్న ఆమె కోరిక నెరవేరింది. కొద్దిసేపే అయినా.. తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఆ అనుభూతిని పొందారు. ఆ సమయంలో అక్కడున్న కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది భావోద్వేగానికి గురయ్యారు. ఆనందంతో పాటు కన్నీళ్లు ఆగలేదు. డెనిస్‌కు ఎంతో ఇష్టమైన గుర్రాలను ఆమె దగ్గరకు తీసుకురావడం ద్వారా ఆమె చివరి కోరికను నెరవేర్చగలిగామని సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.
‘మేమంతా ఏడ్చేశాం.. అది ఎంతో భావోద్వేగ క్షణం’
రోగులకు ఆ రోజు ఏది ముఖ్యమో తెలుసుకుని, వారి కోరికలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని సెయింట్ బర్నబాస్ హాస్పిస్ హెల్త్‌కేర్ అసిస్టెంట్ క్లైర్ విగ్గిన్స్ తెలిపారు. ‘డెనిస్‌ను ఏది సంతోషపెడుతుందని అడిగినప్పుడు.. మరోసారి గుర్రాన్ని చూడాలని కోరుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి, కొన్ని ఫోన్ కాల్స్ చేశాం. ఫేస్‌బుక్‌లో సహాయం కోరాం. కెర్రీ ముందుకొచ్చి తన రెండు పోనీలను హాస్పిస్‌కు తీసుకురావడానికి అంగీకరించారు’ అని క్లైర్ వివరించారు. ‘డెనిస్ ఎంతో సంతోషించింది. అది చాలా భావోద్వేగ క్షణం. అక్కడున్న మేమంతా ఏడ్చేశాం. ఆమె చివరి కోరికను నెరవేర్చినందుకు, ఆమె పిల్లలకు తమ తల్లితో ఇలాంటి మధురమైన జ్ఞాపకాలను అందించినందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అన్నారు.
36 గంటల తర్వాత ప్రశాంతంగా కన్నుమూత
ఈ ఘటన తర్వాత డెనిస్ కుమార్తె జోవాన్ ఫేస్‌బుక్‌లో భావోద్వేగ పోస్టు పెట్టింది. తన తల్లికి చివరి రోజుల్లో ఇంత విలువైన అనుభూతిని అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది.’అదొక అద్భుత అనుభూతి. అమ్మ ఏడ్చింది.. మేం ఏడ్చాం.. నర్సులు కూడా ఏడ్చారు!’ అని పోస్టులో తెలిపింది. గుర్రాలను చూసిన 36 గంటల తర్వాత తన తల్లి ప్రశాంతంగా కన్నుమూసిందని జోవాన్ తెలిపింది. తల్లి పూర్తి స్పృహలో ఉండి, ఇష్టమైన అనుభూతిని పూర్తిగా ఆస్వాదించారనీ రాసుకొచ్చింది.
జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం!
డెనిస్ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో పలువురిని భావోద్వేగానికి గురిచేస్తోంది. జీవిత చరమాంకంలో ఉన్న వ్యక్తులకు మందులు, చికిత్స మాత్రమే కాకుండా.. వారికి ఇష్టమైన వ్యక్తులు, జంతువులు, సంగీతం వంటి వాటితో గడిపే సమయం కూడా ఎంతో విలువైనదని ఈ ఘటన గుర్తుచేస్తోంది. ఒకరి చివరి కోరికను నెరవేర్చడానికి పెద్దగా కష్టపడకుండా, కొంచెం శ్రద్ధ, మరికొంత మానవత్వం ఉంటే చాలు అని డెనిస్ కథ నిరూపిస్తోంది.