Gun in School Bag: స్కూల్‌కి గన్‌ తీసుకొచ్చి.. మరో విద్యార్ధిపై కాల్పులు జరిపిన నర్సరీ స్టూడెంట్! గోడదూకి పరార్

|

Jul 31, 2024 | 4:54 PM

బీహార్‌లోని సుపాల్ జిల్లా త్రివేణిగంజ్‌లోని సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్‌లో బుధవారం (జులై 31) షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. లాల్‌పట్టిలోని ఈ ప్రైవేట్‌ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న పదేళ్ల విద్యార్థినిపై నర్సరీ చదువుతున్న ఐదేళ్ల బాలుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో విద్యార్థి చేతికి గాయం అయ్యింది. నర్సరీ బాలుడు తన స్కూల్‌ బ్యాగ్‌లో గన్‌ దాచుకుని, పాఠశాలకు వెళ్లాడు. గాయపడిన చిన్నారిని వెంటనే..

Gun in School Bag: స్కూల్‌కి గన్‌ తీసుకొచ్చి.. మరో విద్యార్ధిపై కాల్పులు జరిపిన నర్సరీ స్టూడెంట్! గోడదూకి పరార్
Gun In School Bag
Follow us on

బీహార్‌, జులై 31: బీహార్‌లోని సుపాల్ జిల్లా త్రివేణిగంజ్‌లోని సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్‌లో బుధవారం (జులై 31) షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. లాల్‌పట్టిలోని ఈ ప్రైవేట్‌ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న పదేళ్ల విద్యార్థినిపై నర్సరీ చదువుతున్న ఐదేళ్ల బాలుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో విద్యార్థి చేతికి గాయం అయ్యింది. నర్సరీ బాలుడు తన స్కూల్‌ బ్యాగ్‌లో గన్‌ దాచుకుని, పాఠశాలకు వెళ్లాడు. గాయపడిన చిన్నారిని వెంటనే సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధిత విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులకు సమాచారం అందించడంతో.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. విద్యార్థికి ఆయుధం ఎలా లభించిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందిత బాలుడి తండ్రి గతంలో ఓ పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన విద్యార్థి కుటుంబీకులు మాట్లాడుతూ.. తమ కుమారుడిపై కాల్పులు జరిపినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఫోన్‌ చేసి తెలిసారన్నారు. ఆసుపత్రిలో చేర్చామని, వీలైనంత త్వరగా ఆస్పత్రికి రావాలని కోరినట్లు తెలిపారు.

అసలేం జరిగిందంటే..

గాయపడిన బాలుడు సెయింట్ జాన్స్ బోర్డింగ్ స్కూల్‌లో చదువుతున్నాడు. రోజు మాదిరిగానే ఈ రోజు కూడా పాఠశాలకు వెళ్లిన బాలుడు, మొదట ప్రార్థనకు వెళ్లి తన తరగతికి వెళ్ళాడు. క్లాస్‌కి వెళ్లగానే ముఖేష్ కుమార్ యాదవ్ కొడుకు బాలుడిపై కాల్పులు జరిపాడు. నిందితుడైన బాలుడితో గాయపడిన బాలుడికి ఎలాంటి గొడవలు లేవు. నిందిత బాలుడు తొలుత తన నడుముపై కాల్చడానికి ప్రయత్నించాడని, ఆ తర్వాత బాలుడి ఎడమ చేతికి గురిపెట్టి కాల్చినట్లు బాధిత బాలుడు తెలిపాడు. కాల్పుల ఘటన చోటు చేసుకున్న వెంటనే స్కూల్ ప్రిన్సిపాల్ బాలుడి నుంచి తుపాకీ తీసుకుని, బాలుడి తల్లిదండ్రులను పిలిపించారు. కాల్పులు జరిపిన బాలుడి తండ్రి పాఠశాలకు చేరుకోవడంతో ప్రిన్సిపాల్ గదిలో టేబుల్‌పై ఉంచిన తుపాకీని చూపించారు. అనంతరం అతడు తుపాకీతోపాటు బాలుడిని తీసుకుని, గోడ దూకి అక్కడి నుంచి పారిపోయాడు. అతను స్కూల్‌కి బైక్‌పై రాగా.. దాన్ని కూడా స్కూల్‌లోనే వదిలేసి పారిపోయాడు. గాయపడిన బాలుడు రెండేళ్లుగా ఆ స్కూల్లో చదువుతున్నాడు. బాలుడి ఎడమ చేతికి కాల్పులు జరిగాయి.

 

ఇవి కూడా చదవండి

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పాఠశాల యాజమాన్యం, పోలీసులు ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని గాయపడిన విద్యార్థి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. ఓ చిన్న పిల్లవాడు ఇలాంటి పనికి పాల్పడితే నమ్మలేకపోతున్నామని బాధిత బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. నిందిత బాలుడి తల్లిదండ్రులను కూడా విచారించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. స్కూల్ ప్రిన్సిపాల్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇంత పెద్ద నిర్లక్ష్యం ఎలా జరిగిందంటూ ప్రశ్నిస్తున్నారు. కాల్పులు జరిపిన విద్యార్థి, అతడి తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీంతో భయాందోళనకు గురైన ఇతర విద్యార్ధుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.