AAP – Arvind Kejriwal: దేశంలో వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాయి. పలు ప్రాంతాల్లో ఎన్నికల హామీలను ప్రకటిస్తూ ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికల కోసం కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే పంజాబ్, యూపీపై దృష్టిసారించిన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. గోవాపై దృష్టిసారించారు. గోవాలో ఆప్ అధికారంలోకి వస్తే ప్రతీ కుటుంబానికి 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు. గోవా పర్యటనలో భాగంగా.. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఆయన పలు హామీలు గుప్పించారు. పాత విద్యుత్ బిల్లులు పూర్తిగా మాఫీ చేస్తామని స్పష్టంచేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గోవాలో విద్యుత్ కోతలు ఉండవని హామీ ఇచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని.. సమన్యాయంతో ముందుకెళ్తామని భరోసా ఇచ్చారు.
300 యూనిట్ల వరకూ ప్రతీ కుటుంబానికి ఉచిత విద్యుత్ ద్వారా రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. వారంతా విద్యుత్ బిల్లులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. తాను ఢిల్లీ సీఎంగా ఎన్నికైనప్పటి నుంచి ప్రతీ వీధిలో వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు చేయిస్తున్నామన్నారు. దీంతో దేశ రాజధానిలో నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీ తాను తీసుకువచ్చిన పథకాల గురించి ఆయన తెలియజేశారు.
Also Read: