Bengaluru rains: భారీ వర్షాలతో బెంగళూరు అతలాకుతలం.. భవనం కూలి ముగ్గురు మృతి..

|

Oct 22, 2024 | 7:57 PM

భారీ వర్షాలకు మరోసారి బెంగళూరు అతలాకుతలమైంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి ముగ్గురు చనిపోగా.. రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. దక్షిణ ప్రాంతం మొత్తం నీట మునగడంతో అధికారులు అప్రమత్తమైయ్యారు.

Bengaluru rains: భారీ వర్షాలతో  బెంగళూరు అతలాకుతలం.. భవనం కూలి ముగ్గురు మృతి..
Building Collapsed
Follow us on

బెంగళూరు నగరంలో భారీ వర్షాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. నలుగురిని సిబ్బంది కాపాడారు. హెన్నూరు సమీపంలోని బాబుస్‌పాల్య ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాదాపు 13 మంది కార్మికులు శిథిలాలలో చిక్కుకున్నారు. శిథిలాల మధ్య చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ దానా తుఫాన్‌ బెంగళూరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సిటీని భారీ వర్షం ముంచెత్తడంతో రహదారులపై నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. బెంగళూరులోని దక్షిణ ప్రాంతం మొత్తం నీట మునిగింది. అనేక ఇళ్లలోకి నీళ్లు చేరడంతో బాధితులను NDRF సిబ్బంది బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సిటీలోని పలు రహదారుల్లో మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే 1997లో 178.9 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైందని.. ఆ రికార్డును ప్రస్తుతం ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం అధిగమించిందని వాతావరణ శాఖ ప్రకటించింది.

నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి కారణంగా బెంగళూరులోని పాఠశాలలకు అక్టోబర్ 23 న కర్ణాటక ప్రభుత్వం సెలవు ప్రకటించాలని నిర్ణయించింది. బెంగళూరు వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అక్టోబర్ 23న అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ బెంగళూరు అర్బన్ డీసీ జి జగదీశ ఆదేశాలు జారీ చేశారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..