lightning strikes in WB: పశ్చిమ బెంగాల్‌లో ప్రకృతి విలయానికి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. బెంగాల్‌లో ఉరుములు, మెరుపులు, పిడుగుల ధాటికి 26 మంది దుర్మరణం చెందారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన గాలులు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. పిడుగులతో హుగ్లీ జిల్లాలో 11 మంది, ముర్షిదాబాద్‌లో 9 మంది, బంకురా, ఈస్ట్ మిడ్నాపూర్, వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. కాగా.. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2లక్షల, గాయపడ్డ వారికి రూ.50వేల ఎక్స్‌గ్రేషియాను అందించనున్నట్లు ప్రకటించారు. కేంద్ర మంత్రి అమిత్ షా సైతం మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
దక్షిణ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో సోమవారం సాయంత్రం మెరుపు, ఉరుములతో కూడిన వర్షం కురిసిందని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్బా మెడ్నిపూర్, దక్షిణ 24 పరగణాలు, కోల్‌కతా, హూగ్లీ, హౌరా, ముర్షిదాబాద్, పురులియా, బంకురా, నదియా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం 37.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన కోల్‌కతాలో సాయంత్రం 12 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. రుతు పవనాల ప్రభావంతో నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read: