చెన్నై, జూన్ 20: కల్తీ సార వ్వవహారం తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో గంటగంటకు మరణాల సంఖ్య పెరుగుతుంది. తాజాగా కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 26కు చేరింది. మరో 60 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితుల ఆర్తనాదాలతో ఆస్పత్రులు నిండిపోయాయి. కల్తీ సారా సేవించిన వారు వరుసగా మృతి చెందుతుండటంతో.. అప్పటికే సారా సేవించిన వారంతా ఆస్పత్రులకు పరుగులు తీశారు. దీంతో కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రి బాధితులతో నిండిపోయింది. వీరిలో 30 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రికి తరలించారు.
కాళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ పరామర్శించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కల్తీసార మరణాల పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ‘కల్లకురిచిలో కల్తీ మద్యం సేవించి మరణించిన వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను . నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశాం. అడ్డుకోవడంలో విఫలమైన అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం. ఇలాంటి నేరాలకు పాల్పడే వారి గురించి ప్రజలు తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని, సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలను సహించబోమని’ సీఎం స్టాలిన్ ఓ ప్రకటనలో తెలిపారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి కూడా మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
கள்ளக்குறிச்சியில் கள்ளச்சாராயம் அருந்தியவர்கள் உயிரிழந்த செய்திகேட்டு அதிர்ச்சியும் வேதனையும் அடைந்தேன். இந்த விவகாரத்தில் குற்றத்தில் ஈடுபட்டவர்கள் கைது செய்யப்பட்டுள்ளார்கள். தடுக்கத் தவறிய அதிகாரிகள் மீதும் நடவடிக்கை எடுக்கப்பட்டுள்ளது.
இதுபோன்ற குற்றங்களில் ஈடுபடுபவர்கள்… pic.twitter.com/QGEYo9FWJq
— M.K.Stalin (@mkstalin) June 19, 2024
మరోవైపు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే కలెక్టర్ శ్రావణ్‌కుమార్‌ను కూడా బదిలీ చేసింది. 18 ప్రత్యేక వైద్య బృందాలను చెన్నై నుంచి కళ్లకురిచ్చికి పంపించినట్లు ప్రభుత్వం తన ప్రకటనలో వెల్లడించింది.