
Cylinder Blast: గోవాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్పోరా గ్రామంలో ఉన్న ‘బర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలడంతో 23 మంది మృతి చెందారు. మృతుల్లో చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ సావంత్ పరిశీలించారు. మృతుల్లో నలుగురు పర్యటకులు ఉండగా, మిగతావారంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు పోలీసులు. మృతుల్లో ముగ్గురు సజీవదహనమవగా, 20 మంది ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన నైట్‌క్లబ్ రాజధాని పనాజీకి 25 కి.మీ దూరంలో ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి 12:00 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే, అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. సంఘటన గురించి తెలిసిన వెంటనే పరిపాలనా అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు.
సంఘటనా స్థలంలో సీనియర్ అధికారులు ఉన్నారు. అగ్నిప్రమాదానికి ప్రాథమిక కారణం సిలిండర్ పేలుడు అని భావిస్తున్నారు. ఎందుకంటే చాలా మృతదేహాలను వంటగది ప్రాంతం నుండి వెలికి తీశారు. సంఘటన జరిగిన సమయంలో క్లబ్‌లో చాలా మంది ఉన్నారని స్థానికులు తెలిపారు. వారిలో చాలా మంది తప్పించుకోగలిగారు.
ఎక్కువ మంది ఊపిరాడక మరణించారు: సీఎం
ఈ సంఘటన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం గురించి ఆరా తీశారు. ముగ్గురు వ్యక్తులు కాలిన గాయాలతో మరణించారని, మిగిలిన వారు ఊపిరాడక మరణించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నైట్‌క్లబ్ అగ్నిప్రమాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నైట్‌క్లబ్ అగ్నిమాపక భద్రతా నిబంధనలను పాటించలేదని తెలుస్తోందని ఆయన అన్నారు.
అగ్ని ప్రమాదం జరగడం చాలా బాధాకరం: ప్రధాని
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అర్పోరాలో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమన్నారు. గాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ప్రమాద పరిస్థితిపైగోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ జీతో మాట్లాడినట్లు చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తోందన్నారు. ప్రమాదంలో మరణించిన వారికి PMNRF నుండి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, అలాగే గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున అందించనున్నట్లు మోదీ ప్రకటించారు.
The fire mishap in Arpora, Goa is deeply saddening. My thoughts are with all those who have lost their loved ones. May the injured recover at the earliest. Spoke to Goa CM Dr. Pramod Sawant Ji about the situation. The State Government is providing all possible assistance to those…
— Narendra Modi (@narendramodi) December 7, 2025