కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి షాక్ తగిలింది. “దీదీ కే బోలో” కార్యాక్రమంలో భాగాంగా ఆమె స్వయంగా ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ పర్యటనలో కొన్ని సంఘటనలు ఆమెకు ఊహించని ఇబ్బదుల్ని తెచ్చిపెడుతున్నాయి. తన పరిపాలనా లోపాల్ని ఆమెకు కళ్లకు కట్టినట్టు చూపుతున్నాయి. ఆయా పరిస్థితుల్ని చూసి మమత ఇరకాటంలో పడుతున్నారు. సోమవారం హౌరాలోని ఒక మురికివాడను సందర్శించారు. అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో సుమారు 400 మంది ప్రజలకు కేవలం రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయనే విషయం తెలిసి మమత అవాక్కయ్యారు. ఈ విషయంపై పర్యటన అనంతరం జరిగిన మంత్రుల సమావేశంలో ఆరా తీశారు. ఇటువంటి సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వెంటనే పరిష్కరించాల్సిందిగా మున్సిపల్ మంత్రి హకీమ్‌ను ఆదేశించారు.
రాబోయే ఎన్నికలకు సీఎం మమతా బెనర్జీ ఇప్పటినుంచి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకున్న విషయం తెలిసిందే. “దీదీ కే బోలో ” కార్యక్రమం కూడా ఆయన యాక్షన్ ప్లాన్‌లో భాగమనే చెబుతున్నారు. బహుశా దీదీ ఇలా ప్రజలతో నేరుగా మాట్లాడటం పీకే ఆలోచనే అయ్యంటుందని రాజకీయ వర్గాలు కూడా భావిస్తున్నాయి.