Gurdwara: గురుద్వారాలో సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన ఊరి జనం!

|

May 05, 2024 | 7:49 PM

సిక్కుల పవిత్ర గంథ్రంలోని పేజీలు చింపేశాడని 19 యేళ్ల యువకుడిని ఆ గ్రామస్థులంతా చావగొట్టారు. దీంతో సదరు యువకుడు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఈ షాకింగ్ ఘటన పంజాబ్‌లో ఫిరోజ్‌పూర్‌ జిల్లాలో శనివారం (మే 4) చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లోని బండలా గ్రామంలో ఉన్న గురుద్వారా బాబా బీర్ సింగ్ ప్రాంగణంలోకి శనివారం (మే 4) బక్షిష్ సింగ్ (19) అనే యువకుడు ప్రవేశించాడు. అనుచితంగా ప్రవర్తించిన..

Gurdwara: గురుద్వారాలో సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన ఊరి జనం!
19 Year Old Youth Beaten To Death At Gurdwara
Follow us on

చండీగఢ్‌, మే 5: సిక్కుల పవిత్ర గంథ్రంలోని పేజీలు చింపేశాడని 19 యేళ్ల యువకుడిని ఆ గ్రామస్థులంతా చావగొట్టారు. దీంతో సదరు యువకుడు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఈ షాకింగ్ ఘటన పంజాబ్‌లో ఫిరోజ్‌పూర్‌ జిల్లాలో శనివారం (మే 4) చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లోని బండలా గ్రామంలో ఉన్న గురుద్వారా బాబా బీర్ సింగ్ ప్రాంగణంలోకి శనివారం (మే 4) బక్షిష్ సింగ్ (19) అనే యువకుడు ప్రవేశించాడు. అనుచితంగా ప్రవర్తించిన బక్షిష్‌ సింగ్‌ ఆలయంలోని సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌లోని కొన్ని పేజీలను చించివేసి, ఆపై పారిపోవడానికి యత్నించాడు. దీంతో ఆ ఊరికి చెందిన కొందరు గ్రామస్థులు యువకుడిని పట్టుకున్నారు. ఈ వార్త ఊరంతా వ్యాపించడంతో గ్రామస్థులందరూ గురుద్వారా వద్దకు చేరుకుని యువకుడిని చితకబాదారు. దీంతో తీవ్ర గాయాలపాలైన బక్షిష్‌ సింగ్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

బక్షిష్ మానసిక వికలాంగుడని, అందుకు చికిత్స తీసుకుంటున్నాడని మృతుడి తండ్రి లఖ్వీందర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడిని హత్య చేసిన వారిపై కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. మరోవైపు శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్ కమిటీ చైర్మన్ లఖ్‌బీర్ సింగ్ ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్నారు. ఫిర్యాదు ప్రకారం.. బక్షిష్ మధ్యాహ్నం 2 గంటలకు గురుద్వారాలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో గురు గ్రంథ్ సాహిబ్ ప్రతిష్టించిన గదిలో ఎవరూ లేరు. అతను గురుగ్రంథ సాహిబ్ పేజీలను చించి, చిరిగిన పేజీలతో బయటకు వచ్చాడు. లంగర్ హాల్‌లో కూర్చున్న కొందరు వ్యక్తులు అతన్ని గమనించారు. దీంతో యువకుడు ‘ప్రభు.. వీరి నుంచి నన్ను రక్షించు’ అని గట్టిగట్టిగా కేకలు వేశాడని, అతనిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు లఖ్‌బీర్ సింగ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఫిర్యాదులో బక్షిష్ సింగ్ మృతి గురించి ప్రస్తావించకపోవడం విశేషం. యువకుడిని సజీవంగా పోలీసులకు అప్పగించామని, ఆ తర్వాత ఏం జరిగిందో తమకు తెలియదని లఖ్‌బీర్‌ తెలిపాడు.

లఖ్వీర్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరిఫ్ కే పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 295-ఎ (మతపరమైన విశ్వాసాలను రెచ్చగొట్టడం) కింద పోలీసులు మృతి చెందిన బక్షిష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సమాచారం అందుకున్న సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సౌమ్యమిశ్రా సహా సీనియర్‌ పోలీసు అధికారులు గ్రామానికి చేరుకున్నారు. ఫిరోజ్‌పూర్‌లో సిక్కుల మనోభావాలను దెబ్బతీసిన ఈ ఘటన చాలా దురదృష్టకరమని ఎస్పీ సౌమ్యమిశ్రా అన్నారు. జిల్లాలోని బండలా గ్రామంలో చోటు చేసుకున్న ఈ మొత్తం ఘటన గురుద్వారా వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.