ముస్లిం ఓట్లపై దృష్టి, బెంగాల్‌లో కాలు మోపిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, మమతపై ఫైర్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకున్న మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పశ్చిమ బెంగాల్ పై దృష్టి సారించారు..

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకున్న మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పశ్చిమ బెంగాల్ పై దృష్టి సారించారు. శనివారం కోల్ కతా చేరుకున్న ఆయన హుగ్లీ జిల్లాలో ప్రముఖ ముస్లిం నేత అయిన అబ్బాస్ సిద్దీఖీని కలుసుకుని కీలక చర్చలు జరిపారు. బెంగాల్ లో మరి నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఎంఐఎం నేత ఈ రాష్ట్ర విజిట్, పైగా అబ్బాస్ సిద్దిఖీని కలుసుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని పదేపదే విమర్శించే సిద్దిఖీతో ఒవైసీ..రానున్న ఎన్నికల్లో సీట్ల పంపిణీపై చర్చించారని సమాచారం. ఇందుకు కారణం సిద్దిఖీ కూడా తనో పార్టీని పెడతానని ప్రకటించడమే. వీలైతే ఎం ఐ ఎం, ఈ కొత్త పార్టీ కలిసికట్టుగా పోటీ చేయడమో లేదా ఒంటరిగా వేటికవే పోటీ చేయడమో జరగవచ్చునని భావిస్తున్నారు.
కాగా ఇదే సందర్భంలో ఒవైసీ.. మమతా బెనర్జీని దుయ్యబట్టారు. తమ పార్టీని ఆమె బీజేపీకి బీ గ్రేడ్ పార్టీ అని విమర్శిస్తున్నారని, కానీ మీ బెంగాల్ లో మీ పార్టీ పరిస్థితిని చూసుకోండని ఆయన అన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో మీ రాష్ట్రంలో బీజేపీ 18 సీట్లను గెలుచుకున్న విషయాన్ని మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో మీ తృణమూల్ కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు విసుగెత్తి పోయి ఉన్నారన్నారు. ఇక్కడి ముస్లిములు మార్పును కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.
అయితే తృణమూల్ సీనియర్ నేత సౌగత్ రాయ్.. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇక్కడి ముస్లిములు అధికార పార్టీ పాలననే కోరుకుంటున్నారని, ఇక్కడ మీ హవా సాగదని పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకున్నంత మాత్రాన ఇది బీహార్ కాదని, బెంగాల్ అని దెప్పి పొడిచారు.
Also Read:
TDP Politburo Meeting : ప్రారంభమైన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం.. గైర్హాజరైన నేతలు ఎవరంటే..?
12 ఏళ్ళు పైబడిన పిల్లలకు కూడా భారత్ బయోటెక్ వ్యాక్సిన్, అనుమతించిన డీసీజీఐ, ఆందోళన అనవసరమన్న సంస్ధ