
వాకింగ్.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాకింగ్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. డాక్టర్లు సైతం డైలీ వాకింగ్ చేయాలని చెబుతారు. వాకింగ్ గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు రక్తంలో చక్కెరను నియంత్రించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజూ నడవడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపడడంతో పాటు ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా నిద్ర నాణ్యత, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే చాలా మంది వాకింగ్ చేసేటప్పుడు కొన్ని సాధారణ తప్పులు చేస్తారు. ఇది దాని ప్రయోజనాలను తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో నడుస్తున్నప్పుడు ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం..
మంచి ఆరోగ్యం కోసం.. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వేగంగా నడవడం అవసరం. దీనిని రోజుకు 15-15 నిమిషాల సెషన్‌లుగా కూడా డివైడ్ చేసుకోవచ్చు. బరువు తగ్గడం కోసం అయితే.. 45-60 నిమిషాలు వేగంగా నడవడం ప్రయోజనకరంగా ఉంటుంది. నడకతో పాటు పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. కేవలం నడక ద్వారానే ఫిట్‌నెస్ సాధించడం కష్టం. దీనితో పాటు తగినంత నీరు త్రాగడం, పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించాలి.
నడుస్తున్నప్పుడు.. చాలా మంది ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే బదులు వారి ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని అలవాట్లను అవలంబిస్తారు. అందులో మొదటిది.. పాదరక్షలు. వాకింగ్‌కు అనుకూలంగా లేని చెప్పులు, షూస్ వల్ల పాదాలలో నొప్పి, గాయం ఏర్పడుతుంది. చాలా నెమ్మదిగా నడవడం లేదా తరచుగా ఆపడం వల్ల కేలరీలు బర్న్ అవ్వడం కష్టమవుతుంది. నడుస్తున్నప్పుడు నిరంతరం మొబైల్ ఫోన్ వైపు చూడటం వల్ల శరీర భంగిమ కూడా చెడిపోతుంది. గాయం అయ్యే ప్రమాదం పెరుగుతుంది.
ఖాళీ కడుపుతో ఎక్కువసేపు నడవడం అలసట, బలహీనతకు దారితీస్తుంది. నడక తర్వాత వెంటనే భారీ ఆహారం తినడం జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. దీనితో పాటు వాతావరణానికి అనుగుణంగా దుస్తులు ధరించకపోవడం, వార్మప్, కూల్-డౌన్‌ను విస్మరించడం కూడా చాలా మంది చేసే సాధారణ తప్పులు. అటువంటి పరిస్థితిలో వాటిని నివారించడం ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..