Breastfeeding Tips: బిడ్డకు తల్లిపాలు చాలట్లేదా.. బాలింతలు ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..

|

Aug 04, 2022 | 6:22 PM

World Breastfeeding Week 2022: తల్లి పాలు తాగే పిల్లలు ఎంతో పుష్టిగా ఉంటుంటారు. పాలు పడక కొందరు బాధపడుతుంటే మరికొందరు పిల్లలకు పాలిస్తే తమ అందం, శరీర ఆకృతి పోతుందేమోనని పాలివ్వడం మానేస్తుంటారు.

Breastfeeding Tips: బిడ్డకు తల్లిపాలు చాలట్లేదా.. బాలింతలు ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..
Breastfeeding
Follow us on

World Breastfeeding Week 2022: పిల్లలకు తల్లిపాలు ఆరోగ్యకరం.. కాని చాలామంది తల్లులకు పాలు పడక..వారి పిల్లలకు పోత పాలు పట్టిస్తుంటారు. వీటివల్ల చిన్నారులకు ఆరోగ్య సమస్యలు రావడం, ఎదుగుదల సరిగ్గా లేకపోవడం చూస్తుంటాం. తల్లి పాలు తాగే పిల్లలు ఎంతో పుష్టిగా ఉంటుంటారు. పాలు పడక కొందరు బాధపడుతుంటే మరికొందరు పిల్లలకు పాలిస్తే తమ అందం, శరీర ఆకృతి పోతుందేమోనని పాలివ్వడం మానేస్తుంటారు. సెలబ్రెటీలు, సినీనటులు సహా ధనవంతుల కుటుంబాల్లో ఇలాంటివి ఎక్కువుగా కనిపిస్తాయి. అయితే ఈవిధానం సరికాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిలో భాగంగా తల్లిపాలపై అవగాహన పెంచేందుకు ఈనెల ఒకటో తేదీన ప్రారంభమైన తల్లి పాల వారోత్సవాలు ఈనెల ఏడో తేదీ వరకు జరగనున్నాయి. తల్లి పాల ప్రాముఖ్యతను, ఆవశ్యకతను తెలియజేయడమే ఈవారోత్సవాల ముఖ్య లక్ష్యం… దాదాపు 120కి పైగా దేశాల్లో ఈ తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం… చిన్నారి శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన కొవ్వులు, పిండి పదార్థాలు, విటమిన్ల వంటి పోషకాలన్ని తల్లిపాలలో సమతూకంలో ఉంటాయి. కాన్పు తర్వాత రెండు, మూడు రోజుల్లో వచ్చే ముర్రుపాలు చాలా ముఖ్యమైనవి. పిల్లల ఆరోగ్యానికి తొలి బీజం కూడా తల్లిపాలే. ఐదు రోజుల తర్వాత పాలు పలుచపడినప్పటికి.. వాటిలో కొవ్వులు, లాక్టోజ్ ఎక్కువుగా ఉండటంతో బిడ్డకు ఎక్కువ శక్తినిస్తాయి. రెండు వారాల తర్వాత తల్లిపాలలో 90 శాతం నీరు, 8శాతం పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రోటీన్లు, 2 శాతం ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ఇవ్వన్నీ బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. మరి పిల్లలకు తల్లి పాలివ్వాలని ఏ తల్లి అనుకోదు.. అయితే తమకు పాలు పడటం లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు క్రింది చిట్కాలు పాటిస్తే.. పిల్లలకు పాలివ్వాలనే కోరిక తీర్చుకోవచ్చు.

నీరు ఎక్కువుగా తీసుకోవాలి: ఎక్కువుగా నీరు తాగడం, హైడ్రేట్ డ్ గా ఉండటం ద్వారా తల్లి రొమ్ములో పాలు ఉత్పత్తి అవుతాయి. తల్లి పాలలో అధికమొత్తంలో నీరు ఉంటుంది. అందుచేత నీరు ఎక్కువుగా తీసుకుంటే పుష్కలంగా రొమ్ములో పాలుంటాయి. తల్లులు కనీసం మూడు లీటర్ల నీరు తీసుకోవడంతో పాటు పండ్లరసాలు, హెర్బల్ టీలు, కొబ్బరి నీళ్లు వంటివి ఎక్కువుగా తాగుతూ ఉండాలి.

ఇవి కూడా చదవండి

తరచూ పాలివ్వాలి: బిడ్డకు తరచూ పాలిస్తూ ఉండాలి. కేవలం ఏదో ఒక వైపే కాకుండా పాలిచ్చేందుకు రెండు రొమ్ములను ఉపయోగించాలి. పిల్లలు ఎక్కువ సేపు రొమ్ము పాలు తాగేలా చూసుకోవాలి…ఇది వ్యాయమంగానూ ఉపయోగపడుతుంది. దీని ద్వారా పాల ఉత్పత్తి శక్తి పెరుగుతుంది.

Breastfeeding


మసాజ్ చేసుకోండి: రొమ్ములను సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. పాలు బయటకు రావడానికి ఇది దోహడపదుతుంది. రొమ్ము మసాజ్ లు ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి. వీటి ద్వారా రక్త ప్రవాహం పెరుగుతంది.

ఆహార జాగ్రత్తలు పాటించాలి: రొమ్ముల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి రోజూ తినే ఆహారంలో వెల్లులి, సోపు గింజలు, మెంతులు, జీలకర్ర వంటివి ఉండేలా చూసుకోవాలి. వెల్లుల్లిపాయలోని లాక్టోజెనిక్ లక్షణాలు సహజంగా పాల ఉత్పత్తిని పెంచుతాయి. మెంతులు, సోపు గింజలు గెలాక్టగోగ్ లక్షణాలను కలిగిఉంటాయి. దీని ద్వారా పాల సరఫరా మెరుగవుతుంది.

ఆకుపచ్చ కూరగాయలు తినండి: తల్లుల రొమ్ములకు పాలను అందించే గొప్ప వనరులు ఆకుపచ్చని కూరగాయలు. పాలకూర, మునగకాయలు, బచ్చలికూర వంటివాటికి పాల ఉత్పత్తిని పెంచే లక్షణాలున్నాయి. పచ్చి కూరగాయలే కాకుండా.. క్యారెట్, దుంపలను సలాడ్ గా తింటే ఇవి కూడా తల్లి పాలను పెంచేందుకు ఉపయోగపడతాయి.

ఈ సహజసిద్ధ చిట్కాలు పాటించడంతో పాటు.. ఒత్తిడికి దూరంగా ఉంటూ.. పుష్కలంగా నిద్రపోవడం, మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తే పాలు పెరుగుతుంది.  మరెందుకు ఆలస్యం మీరూ తల్లులయితే.. మీ బిడ్డలకు పాలిచ్చి..వారిని ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దడానికి ఈచిట్కాలను ఫాలో అయిపోండి..

మరిన్ని హెల్త్ కథనాలు చదవండి