
మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి ఇప్పటివరకు శరీర బరువు, కేలరీలు లేదా బాడీ మాస్ ఇండెక్స్ వంటి పాత పద్ధతులనే ప్రామాణికంగా తీసుకుంటున్నాం. కానీ మీరు ఎంత కాలం జీవిస్తారు? వృద్ధాప్యంలో ఎంత స్వతంత్రంగా ఉంటారు? అనే విషయాలను మీ బరువు కంటే మీ కాళ్ల బలం మాత్రమే ఖచ్చితంగా చెబుతుందని అంతర్జాతీయ నిపుణులు వెల్లడిస్తున్నారు. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీల్లో శిక్షణ పొందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి ప్రకారం.. 40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని నిర్ణయించేది వారి గుండె లేదా ఊపిరితిత్తుల కంటే వారి కాళ్ల కండరాలే.
BMI కేవలం ఎత్తుకు తగ్గ బరువును మాత్రమే లెక్కిస్తుంది. కానీ ఆ బరువులో ఎంత కండరం ఉంది.. ఎంత కొవ్వు ఉందనేది చెప్పదు. పరిశోధనల ప్రకారం.. ఒకే రకమైన BMI ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఎవరికైతే కాళ్ల కండరాలు బలంగా ఉంటాయో, వారు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు తేలింది.
30 ఏళ్ల వయస్సు తర్వాత వ్యాయామం చేయని వారు ప్రతి దశాబ్దానికి 3-5శాతం కండరాల బలాన్ని కోల్పోతారు. దీనినే సార్కోపెనియా అంటారు. కాళ్ల బలం తగ్గడం వల్ల వృద్ధాప్యంలో పడిపోవడం, ఎముకలు విరగడం, పక్షవాతం ముప్పు, త్వరగా మరణించే అవకాశం పెరుగుతుంది.
బలమైన కాళ్లు కేవలం నడవడానికి మాత్రమే కాదు.. మెదడు చురుకుదనానికి కూడా కీలకమని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. కాళ్ల కండరాలు బలంగా ఉన్నవారిలో చిత్తవైకల్యం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మన నాడీ వ్యవస్థ, కండరాల మధ్య ఉండే సమన్వయం మెదడు ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
సంక్లిష్టమైన వైద్య పరీక్షలు లేకుండానే మీ కాళ్ల బలాన్ని మీరు ఇంట్లోనే పరీక్షించుకోవచ్చు..
వయస్సుతో సంబంధం లేకుండా ఏ వయస్సులోనైనా వ్యాయామం ద్వారా కాళ్ల బలాన్ని పెంచుకోవచ్చు. దీని కోసం కింద పేర్కొన్న వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు:
స్క్వాట్స్: కుర్చీ సహాయంతో లేదా నేరుగా స్క్వాట్స్ చేయడం.
మెట్లు ఎక్కడం: రోజువారీ పనుల్లో భాగంగా మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోవాలి.
ప్రోటీన్ ఆహారం: కండరాల పెరుగుదల కోసం గుడ్లు, పప్పు ధాన్యాలు, సోయా లేదా పాలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.
నిలబడితే కదలలేం.. కూర్చుంటే లేవలేం అనే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పటి నుండే మీ కాళ్లపై దృష్టి పెట్టండి. బరువు తగ్గడం కంటే కండరాలు పెంచుకోవడమే అసలైన దీర్ఘాయువు రహస్యం.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..