పెళ్లి పత్రికపై వధూవరుల ఫోటో ఎందుకు ఉండకూడదో తెలుసా..? ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
పెళ్లి అంటేనే వేల ఏళ్ల సంప్రదాయం.. కానీ మారుతున్న కాలంతో పాటు వెడ్డింగ్ కార్డ్స్ స్టైల్ కూడా మారిపోయింది. ఇప్పుడు అందరూ తమ పెళ్లి పత్రికలపై వధూవరుల ఫోటోలను ముద్రించుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ ఆధునిక ట్రెండ్ మీ వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది. అసలు పెళ్లి పత్రికలపై ఫోటోలు ఎందుకు ఉండకూడదో తెలుసుకుందాం..

హిందూ సంప్రదాయంలో పెళ్లి పత్రిక కేవలం ఒక ఆహ్వానం మాత్రమే కాదు.. అది నూతన వధూవరుల వైవాహిక జీవితానికి వేసే తొలి అడుగు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం వెడ్డింగ్ కార్డ్స్‌పై జంటల ఫోటోలను ముద్రించడం ఒక ట్రెండ్‌గా మారింది. కానీ వాస్తు శాస్త్రం, జ్యోతిష్య నిపుణులు ఈ పద్ధతిని వారరిస్తున్నారు. వివాహ పత్రికలపై ఫోటోలు ఎందుకు ఉండకూడదో వివరించే ఆసక్తికరమైన అంశాలు మీకోసం..
దృష్టి దోషం కలిగే ప్రమాదం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నరుడి కంటి చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అనే సామెత ఉంది. పెళ్లి పత్రికలను మనం వందల సంఖ్యలో బంధుమిత్రులకు పంపిణీ చేస్తాం. ఆ పత్రికలు చూసే ప్రతి ఒక్కరూ ఒకే రకమైన ప్రేమతో లేదా సానుకూలతతో చూడరు. కొందరి ప్రతికూల ఆలోచనలు లేదా అసూయతో కూడిన చూపులు వధూవరుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని పెద్దల నమ్మకం.
గౌరవానికి భంగం – ప్రతికూల శక్తి
పెళ్లి పత్రికల వినియోగం కేవలం ముహూర్తం తెలిసే వరకే. వేడుక ముగిసిన తర్వాత చాలా మంది ఆ పత్రికలను చెత్తబుట్టలో పడేస్తారు లేదా అవి ఎవరి కాళ్ల కిందైనా పడే అవకాశం ఉంటుంది. వధూవరుల చిత్రాలు ఉన్న పత్రికలు అలా తొక్కబడటం లేదా చెత్తలో పడటం వల్ల ఆ జంటకు అవమానం జరగడమే కాకుండా, వారిపై ప్రతికూల శక్తి ఏర్పడుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పవిత్రతకు ప్రాధాన్యత
వాస్తు శాస్త్రం ప్రకారం.. వివాహం అనేది ఒక పవిత్రమైన కార్యం. ఆహ్వాన పత్రికపై వినాయకుడి లేదా ఇష్ట దైవాల చిత్రాలను ముద్రించడం శుభప్రదం. కానీ జీవించి ఉన్న వ్యక్తుల చిత్రాలను ముద్రించడం వల్ల పత్రిక యొక్క గంభీరత తగ్గుతుందని శాస్త్రం చెబుతోంది. నిరాడంబరంగా, పవిత్రంగా ఉండే పత్రికే అసలైన శుభసూచకం.
భద్రత – గోప్యత
ఈ డిజిటల్ యుగంలో పెళ్లి పత్రికలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంటాయి. అపరిచితుల చేతుల్లోకి వధూవరుల ఫోటోలు వెళ్లడం వల్ల వ్యక్తిగత గోప్యతకు ముప్పు కలిగే అవకాశం ఉంది. భద్రతా పరంగా కూడా ఇది అంత సమంజసం కాదని నిపుణుల అభిప్రాయం. నేటి ఆధునిక ట్రెండ్స్‌ను అనుసరించడం తప్పు కాదు, కానీ మన సంప్రదాయాలు, వాస్తు నియమాల వెనుక ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. మీ వివాహ బంధం కలకాలం సుఖసంతోషాలతో ఉండాలంటే, ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ఉత్తమం.
