
రాత్రిపూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు వచ్చే గురక శబ్దం వినడానికి సామాన్యంగా అనిపించినా దాని వెనుక అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే మహిళల కంటే పురుషులే ఎక్కువగా గురక పెట్టడానికి గల కారణాలను వైద్య నిపుణులు శాస్త్రీయంగా వివరిస్తున్నారు.
నిద్రపోతున్నప్పుడు ముక్కు, గొంతులోని వాయుమార్గం పూర్తిగా తెరుచుకోకపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ సమయంలో గాలి లోపలికి వెళ్లేటప్పుడు గొంతులోని కణజాలాలు కంపనానికి గురవుతాయి. ఈ కంపనమే మనకు గురక శబ్దంగా వినిపిస్తుంది.
ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ ENT విభాగం అధిపతి డాక్టర్ రవి మహర్ ప్రకారం.. మహిళల కంటే పురుషుల గొంతులోని వాయుమార్గం సహజంగానే ఇరుకైనది. ఇది నిద్రలో ఎక్కువ కంపనాన్ని కలిగిస్తుంది. మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు వాయుమార్గ కండరాలను బలంగా ఉంచుతాయి. పురుషులకు ఈ హార్మోన్ రక్షణ తక్కువగా ఉంటుంది. పురుషులకు గొంతు, మెడ చుట్టూ కొవ్వు చేరే అవకాశం ఎక్కువ. ఇది శ్వాస నాళంపై ఒత్తిడి తెచ్చి గురకకు దారితీస్తుంది.
తేలికపాటి గురక సాధారణమే అయినా అది తీవ్రమైతే స్లీప్ అప్నియా అనే ప్రమాదకర పరిస్థితికి దారితీస్తుంది. ఇందులో నిద్రలో కొన్ని సెకన్ల పాటు శ్వాస ఆగిపోతుంది. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ తగ్గి, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..