మగవాళ్ల కంటే స్త్రీల శరీరం ఎందుకు చల్లగా ఉంటుందో తెలుసా..? దీన్ని వెనకున్న సైన్స్ తెలిస్తే అవాక్కే..

చలికాలం వచ్చిందంటే చాలు.. కొందరు మంచులో కూడా స్లీవ్‌లెస్ షర్టులతో తిరుగుతుంటే, మరికొందరు మాత్రం రెండు మూడు స్వెటర్లు వేసుకున్నా వణికిపోతుంటారు. అసలు ఈ తేడా ఎందుకు? ఒకే వాతావరణంలో ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా ఎందుకు స్పందిస్తుంది? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సైన్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మగవాళ్ల కంటే స్త్రీల శరీరం ఎందుకు చల్లగా ఉంటుందో తెలుసా..? దీన్ని వెనకున్న సైన్స్ తెలిస్తే అవాక్కే..
Metabolism And Body Temperature Link
Image Credit source: Getty Images

Updated on: Jan 17, 2026 | 9:52 PM

శరీర ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులకు కేవలం వాతావరణం మాత్రమే కారణం కాదు మన శరీర అంతర్గత వ్యవస్థే ప్రధాన కారణం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే ప్రధాన యంత్రం మెటబాలిజం. ఎవరికైతే జీవక్రియ రేటు వేగంగా ఉంటుందో వారి శరీరం ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. అటువంటి వారికి బయట చలిగా ఉన్నా పెద్దగా తేడా తెలియదు. అదే జీవక్రియ నెమ్మదిగా ఉన్నవారు త్వరగా చలికి గురవుతారు.

రక్త ప్రసరణ

శరీరంలో రక్తం ఎంత వేగంగా ప్రవహిస్తే, ఉష్ణోగ్రత అంత సమతుల్యంగా ఉంటుంది. రక్త ప్రసరణ సరిగా లేని వారికి చేతులు, కాళ్లు త్వరగా చల్లబడిపోతాయి. ఇలాంటి వారు వెచ్చని గదిలో ఉన్నా కూడా చలిగా అనిపిస్తుందని ఫిర్యాదు చేస్తుంటారు.

కండరాలు – కొవ్వు శాతం

శరీర ఆకృతి కూడా మీరు ఎంత చలిని తట్టుకోగలరో నిర్ణయిస్తుంది. కండర ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్నవారిలో వేడి ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటే అది ఒక ఇన్సులేటర్ లాగా పనిచేసి లోపలి వేడి బయటకు పోకుండా కాపాడుతుంది. అందుకే సన్నగా ఉన్నవారితో పోలిస్తే కాస్త లావుగా ఉన్నవారు చలిని బాగా తట్టుకోగలరు.

స్త్రీ, పురుషుల మధ్య తేడా ఎందుకు?

సాధారణంగా పురుషుల కంటే స్త్రీలకే చలి ఎక్కువగా వేస్తుంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.

హిమోగ్లోబిన్: రక్తహీనత లేదా హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల జలుబు చేసే అవకాశం పెరుగుతుంది. స్త్రీలలో సహజంగానే హిమోగ్లోబిన్ స్థాయిలు పురుషుల కంటే తక్కువగా ఉంటాయి.

శరీర నిర్మాణం: పురుషులతో పోలిస్తే స్త్రీలకు కండరాల శాతం తక్కువగా ఉండటం కూడా ఒక కారణం.

వయస్సు – జీవనశైలి

వయసు పెరిగే కొద్దీ శరీర అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే వృద్ధులకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే తక్కువ నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురై ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణ తప్పుతుంది. టీ, కాఫీలు అతిగా తీసుకోవడం కూడా శరీర ఉష్ణోగ్రతపై ప్రభావం చూపుతుంది. మీకు గదిలో అందరికంటే ఎక్కువగా చలి వేస్తోందంటే అది మీ జీవక్రియ నెమ్మదించినా కావచ్చు లేదా హిమోగ్లోబిన్ లోపం వల్ల కావచ్చు. మంచి పౌష్టికాహారం, తగినంత వ్యాయామం ద్వారా జీవక్రియను మెరుగుపరుచుకుంటే చలిని తట్టుకునే శక్తి పెరుగుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..