AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాదం నూనె కొనే ముందు ఇవి తెలుసుకోండి.. లేకుంటే రిస్కులో పడుతారు..!

బాదం నూనెను చర్మానికి రాయడం చాలా మందికి అలవాటు. ఇది ముఖానికి అందాన్ని, మెరుపునిస్తుందని చాలా మంది ఇష్టంగా వాడుతుంటారు. కానీ ఈ నూనె అందరికీ ఒకేలా పనిచేయదు. కొందరికి బాదం నూనె వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వాడే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

బాదం నూనె కొనే ముందు ఇవి తెలుసుకోండి.. లేకుంటే రిస్కులో పడుతారు..!
Almond Oil Benefits
Prashanthi V
|

Updated on: May 15, 2025 | 7:23 PM

Share

ఈ నూనెలో కొన్ని పదార్థాలు ఉంటాయి. అవి కొందరి చర్మానికి పడవు. ఈ నూనె రాసినప్పుడు చర్మం దురద పెట్టడం, ఎర్రగా అవ్వడం, వేడిగా అనిపించడం వంటి ఇబ్బందులు రావచ్చు. సున్నితమైన చర్మం లేదా అలర్జీలు ఉన్నవారికి ఇది అంత మంచిది కాదు. కాబట్టి బాదం నూనె వాడేటప్పుడు మీ చర్మం రకం ఏంటో తెలుసుకోని వాడడం చాలా ముఖ్యం.

ఆయిలీ స్కిన్ ఉన్నవారికి బాదం నూనె సరిగ్గా సెట్ అవ్వదు. ఈ నూనె వాడిన తర్వాత మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఖం మీద నూనె ఉండటం వల్ల మురికి పేరుకుపోయి ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఆయిలీ చర్మం ఉన్నవారు ఈ నూనె వాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

కొందరికి బాదం నూనెలోని పదార్థాలు పడవు, దీనివల్ల అలర్జీ వస్తుంది. అలర్జీ వస్తే ముఖం ఎర్రగా మారడం, దురదతో పాటు వాపు రావడం సాధారణంగా జరుగుతుంది. అలాంటప్పుడు వెంటనే నూనె వాడటం ఆపేయాలి. మొదట కొంచెం నూనెను చిన్న చోట రాసి పరీక్షించి చూడటం మంచిది.

బాదం నూనె వాడితే కొందరి ముఖంపై ఉండే సహజమైన మెరుపు తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. ముఖం కొంచెం జిడ్డుగా, బరువుగా అనిపించవచ్చు. ఇది ముఖం అందాన్ని తగ్గించి.. చర్మం చిరాకుగా కనిపించేలా చేస్తుంది. అందుకే ఈ నూనెను ముఖంపై ఎక్కువగా రాయకూడదు.

ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నూనె రాసుకొని బయటికి వెళ్తే చర్మం మీద మచ్చలు, రంగు మారడం వంటివి జరగవచ్చు. దీనివల్ల చర్మం వేరేలా కనిపిస్తుంది. ఈ సమస్య రాకుండా ఎండలో వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

  • మీ చర్మం రకం తెలుసుకోండి.. మీకు బాదం నూనె సరిపోతుందా లేదా అని ముందుగా తెలుసుకోవాలి. సున్నితమైన లేదా ఆయిలీ చర్మం ఉన్నవారు డాక్టర్‌ను అడిగి సలహా తీసుకోవడం మంచిది.
  • తక్కువగా వాడండి.. నూనెను కొద్దిగానే రాయాలి. ఎక్కువగా రాస్తే చెడు ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది.
  • అలర్జీ పరీక్ష.. కొత్తగా ఈ నూనె వాడే ముందు చేతిపై కొంచెం రాసి చూడండి. దురద లేదా ఎర్రదనం లేకపోతేనే వాడండి.
  • మంచి నూనెను ఎంచుకోండి.. మార్కెట్లో చాలా రకాల బాదం నూనెలు ఉంటాయి. వాటిలో మంచి నాణ్యత ఉన్న నూనెనే వాడాలి.
  • ఎండలో జాగ్రత్త.. నూనె రాసిన తర్వాత ఎండలో ఎక్కువగా తిరగకూడదు.

బాదం నూనె చర్మానికి తేమను, మెరుపును ఇస్తుంది. కానీ అందరికీ ఇది సరిగ్గా పనిచేయకపోవచ్చు. మీ చర్మం రకానికి తగిన జాగ్రత్తలు తీసుకుని వాడితేనే బాదం నూనె మంచి ఫలితాలు ఇస్తుంది. ఎండ నుంచి రక్షణ తీసుకుంటూ తక్కువగా వాడితే మీ చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది.