
మగవాళ్లు తమ భావోద్వేగాలను త్వరగా వ్యక్తపరచరు.. మహిళలే ముందుగా ప్రేమలో పడతారు.. అనే మాటను మనం ఎన్నోసార్లు వినే ఉంటాం. కానీ ఈ పాత నమ్మకాన్ని తిరగరాస్తూ, ప్రేమ గురించిన ఒక సరికొత్త నిజం అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. మహిళల కంటే పురుషులే అతి త్వరగా ప్రేమలో పడతారట. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు బయోలజీ ఆఫ్ సెక్స్ డిఫరెన్సెస్ అనే జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 33 దేశాలకు చెందిన 18 నుంచి 25 ఏళ్ల వయస్సు గల 808 మంది యువతీ యువకులపై ఈ సర్వే నిర్వహించారు.
స్పీడ్ లవ్: పురుషులు సగటున 0.98 నెలల్లో ప్రేమలో పడుతుండగా, మహిళలకు అదే స్థాయికి చేరుకోవడానికి 1.92 నెలలు పడుతుందని ఈ పరిశోధన తెలిపింది.
ఎక్కువ సార్లు: పురుషులు తమ జీవితకాలంలో సగటున 2.6 సార్లు ప్రేమలో పడితే, మహిళల్లో ఈ సంఖ్య 2.3గా ఉంది.
గాఢతలో మహిళలదే పైచేయి: పురుషులు త్వరగా ఆకర్షితులైనప్పటికీ.. ప్రేమలోని తీవ్రత, భావోద్వేగ అనుబంధం, కమిట్‌మెంట్, భాగస్వామి గురించే ఎప్పుడూ ఆలోచించడం వంటి విషయాల్లో మహిళలే ముందున్నారని సర్వే తెలిపింది.
సినిమాల్లో చూపించినట్లు మొదటి చూపులోనే ప్రేమలో పడిపోవడం అందరికీ జరగదు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 39శాతం మందికి డేటింగ్ ప్రారంభమైన తర్వాతే తాము ప్రేమలో ఉన్నామనే విషయం అర్థమైంది. అంటే చాలామందికి ప్రేమ అనేది ఒక్క క్షణంలో పుట్టేది కాదు, అదొక నెమ్మదైన ప్రక్రియ అని తేలింది.
మనం నివసించే దేశం, వాతావరణం కూడా మన ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. లింగ సమానత్వం ఎక్కువగా ఉన్న దేశాల్లోని ప్రజలలో ప్రేమ తీవ్రత, అతిగా ఆలోచించే ధోరణి కాస్త తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది.
మొత్తానికి.. మగవాళ్లకు భావోద్వేగాలు తక్కువ అనే అభిప్రాయానికి ఈ రీసెర్చ్ ఒక శాస్త్రీయ సమాధానం ఇచ్చింది. మగవారు త్వరగా ప్రేమలో పడితే, ఆడవారు ఆ ప్రేమను మరింత లోతుగా, గాఢంగా అనుభవిస్తారు. అయితే ఈ సర్వే పరిమిత వయస్సు (18-25) ఉన్న వారిపైనే జరిగిందని, వ్యక్తిగత అనుభవాలు పరిస్థితులను బట్టి మారవచ్చని నిపుణులు గుర్తుచేస్తున్నారు.