
బరువు తగ్గటం కోసం జనం పడని పాట్లంటూ అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఒంట్లో కొవ్వును కరిగించుకోవడం కోసం జిమ్ముల చుట్టూ తిరుగుతూ పార్కుల చుట్టూ పరిగెత్తుతూ కేలరీలను కరిగించడం మనమందరం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా ఓ అధ్యాయంలో కాఫీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వును కరిగించుకోవచ్చని తేలింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకుందాం.
కాఫీ తాగితే బరువు తగ్గుతారా అంటే తగ్గే చాన్స్ ఉందని శాస్త్రీయ ఆధారాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా కాఫీలోని నియాసిన్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే కండరాల పనితీరుకు సహాయపడటంతో పాటు, మెరుగైన గుండే ఆరోగ్యానికి కూడా కాఫీ కారణం అవుతోంది. ముఖ్యంగా ఇందులో ఉండే కెఫిన్ నరాలను ఉత్తేజ పరచడంతో పాటు, బీపీని నియంత్రిస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజీకి చెందిన మెడికల్ జర్నల్ పేర్కొంది.
అంతేకాదు బరువు తగ్గడంలో కూడా కాఫీ ప్రధాన పాత్ర పోషిస్తోందని ఈ పరిశోధన తేల్చింది. ముఖ్యంగా కాఫీ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు స్థాయి నియంత్రణలోకి వస్తుందని, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించగా, BMJ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించబడింది.
యూరోపియన్ సంతతికి చెందిన దాదాపు 10,000 మంది వ్యక్తులలో కనిపించే CYP1A2, AHR జన్యువులపై ఈ అధ్యయనం ప్రధానంగా సాగింది. CYP1A2, AHR జన్యువులు శరీరంలో కెఫిన్ జీవక్రియ రేటుకు సంబంధించినవి. ఈ పరిశోధన ఫలితాల్లో కెఫిన్ స్థాయి ఎక్కువగా ఉన్న వ్యక్తుల శరీర BMI తక్కువగా ఉందని, వారిలో టైప్ 2 డయాబెటిస్ సైతం వచ్చే అవకాశం అవకాశం తక్కువగా ఉందని తేలింది.
అధ్యయనాల ప్రకారం, కెఫీన్ తీసుకోవడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ, రోజుకు 400 mg కంటే ఎక్కువ కెఫిన్ ఆరోగ్యానికి ప్రమాదకరం. అయితే కాఫీ తాగడం వల్ల ఆకలి తగ్గుతుందని, క్యాలరీలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అల్జీమర్స్ , పార్కిన్సన్స్ పరిస్థితుల నుండి రక్షించడానికి కాఫీ సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. కాఫీ తాగడం వల్ల డిమెన్షియా వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కాఫీ ఒత్తిడిని, డిప్రెషన్‌ని తగ్గించగలదని పరిశోధనలో తేలింది. కాఫీ ఆత్మహత్య ధోరణులను కూడా తగ్గిస్తుంది. కాఫీ తాగేవారు శారీరకంగా చురుగ్గా ఉండే అవకాశం ఉందని కూడా అధ్యయనం సూచిస్తుంది.
అంతేకాదు కాఫీలోని కెఫిన్ నాడీ మండలంపై చాలా చురుకుగా పనిచేస్తుంది. ముఖ్యంగా మెదడుకు సంబంధించిన వ్యాధులను నివారించడంలో కెఫిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రోజు పరిమితంగా కాఫీ తాగడం వలన మెదడు చురుగ్గా ఉంటుందని, ఆందోళనకరమైన ఆలోచనలు రావని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కాఫీ అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలు సైతం ఉన్నాయి. ముఖ్యంగా శరీరంలో కెఫిన్ అధికంగా ఉంటే అది జీర్ణ వ్యవస్థను పాడు చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. తద్వారా ఆకలి మందగించి సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే పరిమితంగా కాఫీ తీసుకుంటే మాత్రం ఔషధంగా పనిచేస్తుందని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి