
ప్రస్తుత డిజిటల్ యుగంలో మన వ్యక్తిత్వాలను, భావోద్వేగాలను వివరించడానికి రకరకాల కొత్త పదాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటివరకు మనకు ‘ఇంట్రోవర్ట్’ ( అంతర్ముఖుడు), ‘ఎక్స్‌ట్రోవర్ట్’ ( బహిర్ముఖుడు) అనే పదాలు మాత్రమే తెలుసు. కానీ, ఇటీవల సోషల్ మీడియాలో ‘ఓట్రోవర్ట్’ అనే కొత్త పదం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. చాలామంది తమ గురించి తాము ఇన్నాళ్లూ వివరించలేకపోయిన ఒక విలక్షణమైన స్థితిని ఈ పదం ఖచ్చితంగా ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడుతున్నారు. అసలు ఈ ‘ఓట్రోవర్ట్’ అంటే ఎవరు? వారి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం.
పైకి చూస్తే ఓట్రోవర్టులు అందరితో కలిసినట్లు, సంభాషణల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు కనిపిస్తారు. వారు ఏ గుంపులోనైనా సులభంగా కలిసిపోగలరు. కానీ, లోపల మాత్రం వారు ఆ సమూహానికి చెందని వారిలా భావిస్తుంటారు. వీరిని “ఇన్‌సైడర్లలా పరిగణించబడే అవుట్‌సైడర్లు” అని ప్రముఖ డాక్టర్ వర్ణించారు.
ఓట్రోవర్ట్ అనేది ఒక వ్యక్తిత్వం కాదు. మనుషులను ఏదో ఒక కేటగిరీకి పరిమితం చేయడం వల్ల వారిలోని సహజత్వాన్ని కోల్పోతాం. ఓట్రోవర్టులు తమ స్వేచ్ఛను, స్వతంత్రతను అమితంగా ప్రేమిస్తారు. వీరు ఇతరుల గుర్తింపు కోసం ఆరాటపడరు, తమకంటూ ఒక ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటారు. “నేను ఎవరికీ తక్కువ కాదు.. అలాగని అందరితో ఒకరిని కాదు” అని భావించే వారికి ‘ఓట్రోవర్ట్’ అనేది ఒక చక్కని నిర్వచనం. మీరు కూడా ఒకరితో మనస్ఫూర్తిగా కనెక్ట్ అవుతూనే, మీ అంతర్గత స్వేచ్ఛను కాపాడుకోవాలనుకుంటే.. మీరు ఖచ్చితంగా ఒక ‘ఓట్రోవర్ట్’ కావొచ్చు. ఈ సంక్లిష్టమైన ప్రపంచంలో మన వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవడం అనేది మానసిక ఎదుగుదలకు మొదటి అడుగు.