
భారతీయ వంటకాల్లో నల్ల మిరియాలకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. అయితే చాలామందికి ఇంట్లోనే మిరియాల మొక్కను పెంచాలని ఉన్నప్పటికీ, దాని విత్తనాలు త్వరగా మొలకెత్తక ఫేలవుతుంటారు. సాధారణంగా సుదీర్ఘ సమయం తీసుకునే ఈ ప్రక్రియను చాలా సులభంగా, తక్కువ వ్యవధిలోనే పూర్తి చేయడానికి గార్డెనింగ్ నిపుణులు ఒక అద్భుతమైన బనానా ట్రిక్ సూచిస్తున్నారు. ఇలా ట్రై చేశారంటే.. మిరియాల విత్తనాలు త్వరగా మొలకెత్తి ఆరోగ్యకరమైన తీగగా పెరుగుతాయి.
ఇంట్లోనే కుండీ లో నల్ల మిరియాల మొక్కను తక్కువ సమయంలో, సులభంగా పెంచడానికి ఒక గార్డెనింగ్ ఎక్స్‌పర్ట్ సీక్రెట్ హ్యాక్‌ను పంచుకున్నారు. అరటిపండు, కలబంద సహాయంతో మిరియాల గింజలు వేగంగా మొలకెత్తేలా చేయవచ్చు. ఈ విధానం విత్తనాలకు అవసరమైన పోషకాలను, తేమను అందించి నేచురల్ రూటింగ్ హార్మోన్‌లా పనిచేస్తుంది. దీనివల్ల మిరియాల విత్తనాలు త్వరగా మొలకెత్తి ఆరోగ్యకరమైన తీగగా పెరుగుతాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
ఈ పద్ధతి కోసం ముందుగా నాణ్యమైన, తాజా నల్ల మిరియాల విత్తనాలను ఎంచుకోవాలి. మార్కెట్లో దొరికే ఓవర్-ప్రాసెస్డ్ లేదా ఎండిపోయిన విత్తనాలు త్వరగా మొలకెత్తవు. వీటితో పాటు బాగా పండిన ఒక అరటిపండును తీసుకోవాలి. అరటిపండులోని పొటాషియం, ఫాస్ఫరస్, సహజ సిద్ధమైన తేమ విత్తనాలు వేగంగా వేళ్లు తొడగడానికి ఎంతగానో దోహదపడతాయి.
పండిన అరటిపండును తీసుకుని కత్తితో మధ్యలో చిన్న కోత పెట్టాలి. అందులో కొన్ని మిరియాల గింజలను గట్టిగా లోపలికి నొక్కాలి. అరటిపండులో అమర్చిన విత్తనాలపై తాజా కలబంద జెల్ రాయాలి. కలబంద ఒక సహజమైన రూటింగ్ హార్మోన్, యాంటీ-ఫంగల్ ఏజెంట్‌గా పనిచేసి, విత్తనాలకు శిలీంధ్రాలు పట్టకుండా కాపాడుతుంది. కుండీలో తోట మట్టి, కోకోపీట్, వర్మీకంపోస్ట్ మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. మధ్యలో చిన్న గుంట చేసి, విత్తనాలు అమర్చిన అరటిపండు భాగాన్ని అందులో ఉంచి పైన తేలికగా మట్టి కప్పాలి.
మొక్క నాటిన తర్వాత తేలికగా నీరు చల్లాలి. కుండీని నేరుగా తీవ్రమైన ఎండలో కాకుండా, ఉదయం పూట 2-3 గంటల స్వల్ప ఎండ తగిలే ప్రదేశంలో ఉంచాలి. అరటిపండు లోపల కుళ్ళిపోయి సహజమైన ఎరువుగా మారి విత్తనాలకు నిరంతరం పోషణను అందిస్తుంది.
కొద్ది రోజుల్లోనే చిన్న చిన్న మొలకలు బయటకు వస్తాయి. మిరియాల మొక్క ఒక తీగ లాంటిది. కాబట్టి, మొలకలు కాస్త పెద్దయ్యాక ఒక కర్ర లేదా సపోర్ట్ స్టిక్ ఏర్పాటు చేస్తే అది పైకి పాకి ఆరోగ్యంగా ఎదుగుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..