
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషకమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మంచి ఆరోగ్యం కోసం మనమంతా పసుపును ఎక్కువగా వాడతాం. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం చాలా రోగాలను నయం చేస్తుంది, అందుకే దీన్ని బంగారు మసాలా అంటారు. అయితే ఈ పసుపును పాలతో కలిపి తాగాలా లేక నీటితో కలిపి తాగాలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ రెండింటి ప్రయోజనాలు ఇక్కడ సులభంగా తెలుసుకుందాం.
వంటగదిలో సులభంగా లభించే పసుపులో బయోయాక్టివ్ సమ్మేళనాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. పసుపులోని క్రియాశీల సమ్మేళనం కర్కుమిన్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది వృద్ధాప్యం, ఊబకాయంతో సంబంధం ఉన్న గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చూపించాయి. అంతేకాకుండా హెల్త్‌లైన్ ప్రకారం.. కర్కుమిన్ మెదడు కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వాపును నివారించడంతో పాటు ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. కీళ్ల వ్యాధి అయిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న రోగులకు కూడా కర్కుమిన్ సప్లిమెంట్లు ప్రయోజనకరంగా పరిగణించబడతాయి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పసుపు పాలు – పసుపు నీరు రెండూ ప్రయోజనకరమైనవే అయినప్పటికీ వాటి ప్రభావాలు భిన్నంగా ఉంటాయి.
పసుపు నీరు: మీరు బరువు తగ్గాలనుకుంటే లేదా మీ శరీరాన్ని విషపదార్థాల నుండి శుభ్రం చేయాలనుకుంటే పసుపును నీటిని తీసుకోవడం ఉత్తమం. ఉదయం ఖాళీ కడుపుతో పసుపు నీరు తాగడం మంచిది. పచ్చి పసుపును తురుముకుని నీటిలో వేసి బాగా మరిగించి, గోరువెచ్చని నీటిని తాగవచ్చు లేదా పచ్చి పసుపు ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని సేవించవచ్చు.
పసుపు పాలు: పసుపును పాలతో తీసుకున్నప్పుడు అది శరీరంలో త్వరగా శోషించబడుతుంది. పాలు కాల్షియం, విటమిన్ డి, బి12 వంటి పోషకాలను అందిస్తాయి. పసుపుతో కలిపినప్పుడు ఈ పాలు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా రాత్రిపూట పసుపు పాలు తాగడం మంచిది. ఎందుకంటే ఇది నిద్ర సమస్యలను నివారించి, ఒత్తిడిని తగ్గించి, ఎముకలు, కండరాల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పాలలో లభించే విటమిన్ బి12 శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచడానికి కూడా సహాయపడుతుంది.
మీరు పాలు లేదా నీటిలో ఉపయోగించే పసుపు స్వచ్ఛంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో మార్కెట్లో లభించే పసుపులో రంగులు కలుపుతున్నారు. ఇది ప్రయోజనకరంగా ఉండటానికి బదులుగా శరీరానికి హానికరం. అందువల్ల ఇంట్లో పసుపును రుబ్బుకోవాలి లేదా నమ్మకమైన ప్రసిద్ధ బ్రాండ్ నుండి కొనుగోలు చేయాలి.
కాబట్టి మీ ఆరోగ్య లక్ష్యాలను బట్టి పసుపును పాలతో లేదా నీటితో తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు ఉదయం పసుపు నీరు.. మంచి నిద్ర, రోగనిరోధక శక్తి కోసం రాత్రి పసుపు పాలు బెస్ట్ ఆప్షన్స్
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)