Papikondalu Boat Services: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పర్యాటకులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వర్షాలు కురుస్తుండటంతో.. గోదావరి నదికి ఇరువైపులా పచ్చదనం కనువిందు చేస్తోంది. ఈ నేపథ్యంలో పర్యాటకులకు మధురానుభూతినిచ్చే పాపికొండలు బోటు సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ఏపీ పర్యాటక శాఖ కసరత్తులు చేస్తోంది. వాస్తవానికి గత నెలలోనే బోటు ప్రయాణాలను ప్రారంభించేందుకు అధికారులు ఏప్రిల్ 15న ట్రయల్ రన్ నిర్వహించారు. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభించడంతో బోటు సర్వీసులకు బ్రేక్ పడింది. ప్రస్తుతం కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పడుతుండటంతో జూన్ నెలాఖరు నుంచి బోటు సర్వీసులు ప్రారంభించేందుకు పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల బోటు సర్వీసులు ప్రారంభం అయితే.. కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం తర్వాత సుమారు 19 నెలల పాటు ఆగిపోయిన బోటు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి.
అయితే.. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ నెలాఖరుకు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా బోటు సర్వీసులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏఎల్ మల్‌రెడ్డి తెలిపారు. కచ్చులూరు బోటు ప్రమాదం అనంతరం ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించినట్లు తెలిపారు. ప్రయాణాలు భద్రంగా సాగేలా పోలవరం మండలం సింగన్నపల్లి, వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. బోటు ప్రయాణాలను పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు చెందిన సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.
Also Read: