
సాధారణంగా పిల్లలు సాయంత్రం టైంలో స్నాక్స్ తింటారు. అప్పుడు వాళ్లకు బిస్కెట్లు, చాక్లెట్లు వంటి చక్కెర పదార్థాలు ఇవ్వకుండా.. బాదం, జీడిపప్పు, వేయించిన మఖానా వంటివి ఇవ్వండి. ఇవి రుచిగా ఉండే ఆరోగ్యకరమైన ఫుడ్స్. పిల్లలకు చక్కెర తినాలని అనిపించినప్పుడు పండ్లు తినిపించండి. పండ్లలో సహజంగా ఉండే చక్కెర శరీరానికి హాని చేయదు. అరటి, సీతాఫలం, ద్రాక్ష వంటివి మంచి ఎంపికలు. ఇవి తిన్నా చక్కెర తినాలన్న ఆలోచన తగ్గుతుంది.
టీ, కాఫీల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు ఇవి అలవాటైతే దాన్ని మాన్పడం కష్టం. అందుకే వీటికి బదులు అల్లం టీ, గ్రీన్ టీ, లాంటి హెర్బల్ టీలు ఇవ్వొచ్చు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొత్త రుచి కూడా కలుగుతుంది.
పాలు పిల్లల ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ అందులో చక్కెర వేయడం కన్నా తేనె వేసి ఇవ్వడం మంచిది. తేనె సహజమైన తీపి ఇస్తుంది. పాలు త్రాగడం మర్చిపోకుండా ఉండేలా చేయండి.
పిల్లలకు రోజూ ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ ఇవ్వాలి. వీటి వల్ల ఆకలి త్వరగా రాదు. చక్కెర తినాలన్న కోరిక తగ్గుతుంది. గుడ్లు, పప్పులు, పెరుగు వంటి ప్రోటీన్ ఫుడ్స్ మంచి శక్తిని ఇస్తాయి.
పిల్లలు చక్కెర తినకుండా ఉంటే వారికి చిన్న గిఫ్ట్ ఇవ్వండి. పుస్తకం, పెన్సిల్, చిన్న స్టిక్కర్ వంటివి ఇవ్వండి. ఇది వారికి గుర్తుండిపోయే మంచి అలవాటుగా మారుతుంది. చక్కెర వల్ల కలిగే సమస్యల్ని కూడా వారికి సింపుల్ గా వివరించండి.
పిల్లలు పెద్దలను చూసి నేర్చుకుంటారు. మీరే రోజూ టీ, కాఫీ తాగితే వారు కూడా అలానే అడుగుతారు. అందుకే వారి ముందు తాగడం తగ్గించండి. స్వీట్స్ తినాలంటే వారు లేని సమయంలో తినడం మంచిది.
పిల్లలు రోజూ కనీసం 9 గంటలు నిద్రపోవాలి. నిద్ర బాగుంటే హార్మోన్ స్థితి సరిగా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆకలి ఎక్కువగా అనిపించదు. చక్కెర తినాలన్న ఆలోచన తగ్గిపోతుంది. పిల్లలు షుగర్ తక్కువగా తినేందుకు మనం చిన్న చిన్న మార్పులు చేయాలి. హెల్తీ అలవాట్లు పెంచాలి. వారు ఆరోగ్యంగా ఎదగాలంటే ఈ సూచనలు పాటించి చూడండి.