
డయాబెటిస్ ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా భారతీయుల్లో ఈ వ్యాధి ఎక్కువవుతోంది. తీసుకునే ఆహారంలో మార్పులు, మారుతోన్న జీవనశైలి కారణంగా డయాబెటిస్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డయాబెటిస్ ముందుగా గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుంది. రక్తంలో డయాబెటిస్ పెరగడాన్ని కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే..
* నిపుణుల అభిప్రాయం ప్రకారం, రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు, రెటీనాలోని రక్త నాళాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల కంటికి సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. వీటిలో ప్రాధనమైంది దృష్టి మసకబారడం. అలాగే కంటిశుక్లం సమస్య కూడా వెంటాడుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి షుగర్ టెస్ట్ చేసుకోవాలి.
* రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగితే కాళ్లలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కాళ్లలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో కాల్లు ఉబ్బినట్లు కనిపిస్తాయి. అలాగే కాలికి గాయాలు అయితే త్వరగా తగ్గవు.
* బ్లడ్‌లో షుగర్ స్థాయి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. దీనిని డయాబెటిక్ న్యూరోపతి అని కూడా అంటారు. దీంతో కాళ్లు, చేతుల్లో తిమ్మిరి లేదా నొప్పి వంటి సమస్యలు వస్తాయి. జలదరింపు, మంట, తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.
* రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడం కిడ్నీల పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. దీంతో తరచుగా మూత్రవిసర్జన, మూత్రంలో ప్రోటీన్, పాదాలు, చీలమండలు, చేతులు, కాళ్లు వాపులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
* కొన్ని సందర్భాల్లో చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం కూడా డయాబెటిస్‌కు లక్షణంగా చెబుతున్నారు నిపుణులు. అందుకే ఎక్కువ కాలం ఈ సమస్య ఉంటే వెంటనే పరీక్షలు చేసుకోవాలని చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి…