Childhood Obesity: చిన్న వయసులో బరువు పెరగడం అతి పెద్ద సమస్య. ఆధునిక కాలంలో పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల చాలామంది ఊబకాయం బారిన పడుతున్నారు. అంతేకాదు అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. బరువు తగ్గడం కోసం ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు. అయితే పిల్లల్లో ఊబకాయం రావడానికి ప్రధానంగా 5 కారణాలు ఉన్నాయి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.
1. అధిక కేలరీల ఆహారం: స్నాక్స్, చాట్, ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్‌లలో అధిక కేలరీలు ఉంటాయి. ఈ ఆహారాల వల్ల పిల్లల్లో ఊబకాయం వస్తుంది. ఇది కాకుండా మిఠాయి, స్వీట్లు, శీతల పానీయాల కారణంగా పిల్లలు బరువు పెరుగుతున్నారు. అందువల్ల పిల్లల ఆహారం విషయంలో చాలా శ్రద్ధ వహించాలి.
2. వ్యాయామం చేయకపోవడం: క్రీడలపై తక్కువ ఆసక్తి ఉన్న పిల్లలు, వ్యాయామం చేయని పిల్లలు శరీరంలో ఎక్కువగా ఉన్న కేలరీలను కరిగించలేరు. అందువల్ల వీరు ఊబకాయం బారిన పడుతారు. మొబైల్ చూడటం, టీవీ చూడటం, రోజంతా మంచం లేదా సోఫా మీద పడుకుని తినడం, తాగడం చేసే పిల్లల్లో ఊబకాయం అధికంగా కనిపిస్తుంది.
3. జన్యుపరమైన కారణాలు : పిల్లల తల్లిదండ్రులు లేదా కుటుంబంలోని వ్యక్తులకు ఊబకాయం సమస్య ఉంటే పుట్టే పిల్లలు కూడా అధిక బరువుతో జన్మిస్తారు. జన్యపరమైన కారణాల వల్ల వీరు ఇలా పుడుతారు. అయితే సరైన వ్యాయామాం చేయడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
4. మానసిక కారణాలు: కొంతమంది పిల్లలు బరువు పెరగడం వెనుక ఒత్తిడి వంటి మానసిక కారణాలు కూడా ఉంటాయి. ఈ ఒత్తిడి వ్యక్తిగతం కావచ్చు లేదా తల్లిదండ్రుల వల్ల ఏర్పడవచ్చు. ఎందుకంటే ఒత్తిడి వల్ల పిల్లలు అతిగా తినడం చేస్తారు.
5. హార్మోన్ల మార్పులు: కొన్నిసార్లు ఔషధాల వినియోగం కూడా పిల్లలలో బరువు పెరగడానికి దారితీస్తుంది. శరీరంలో హార్మోన్ల మార్పులు కూడా బరువు పెరగడానికి కారణం కావచ్చు. ఏదైనా ఔషధం తీసుకున్న తర్వాత పిల్లల బరువు పెరిగితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.