
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలను ఆడించడం తల్లిదండ్రులకు పెద్ద టాస్క్‌గా మారిపోయింది. ఆఫీస్ పని ఒత్తిడిలోనో లేక కాసేపు ప్రశాంతంగా ఉండాలనో చాలామంది పేరెంట్స్ చేస్తున్న పని.. పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఇవ్వడం. దీనినే నిపుణులు స్క్రీన్ బ్రైబ్ లేదా డిజిటల్ లంచం అని పిలుస్తున్నారు. అయితే ఈ చిన్న అలవాటు మీ పిల్లల ఎదుగుదలను నిలువునా దహించి వేస్తోందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. పిల్లలు మారాం చేసినప్పుడు లేదా వారు ఏడుస్తున్నప్పుడు వారిని శాంతింపజేయడానికి ఫోన్ ఇవ్వడాన్ని స్క్రీన్ బ్రైబ్ అంటారు. ఇది తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా, దీర్ఘకాలంలో పిల్లలను మానసిక రోగులుగా మార్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు వల్ల తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి అత్యంత విలువైన 4 విషయాలను దొంగిలిస్తున్నట్లే లెక్క.
పిల్లలు ఇతరులతో మాట్లాడితేనే భాష వస్తుంది. కానీ ఫోన్‌కు అలవాటు పడిన పిల్లలు కేవలం వినడానికే పరిమితం అవుతున్నారు. దీంతో వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటున్నాయి. నేటి కాలంలో చాలామంది పిల్లల్లో స్పీచ్ డిలే అంటే మాటలు ఆలస్యంగా రావడానికి ప్రధాన కారణం ఇదే.
చుట్టుపక్కల మనుషులతో ఎలా ఉండాలి? ఎవరైనా వస్తే ఎలా పలకరించాలి? వంటి ప్రాథమిక విషయాలను పిల్లలు కోల్పోతున్నారు. స్క్రీన్ ప్రపంచంలో మునిగిపోవడం వల్ల వారు ఒంటరితనాన్ని అలవాటు చేసుకుంటున్నారు. ఇది భవిష్యత్తులో వారిని విపరీతమైన మొండితనం ఉన్నవారిగా మార్చే అవకాశం ఉంది.
పిల్లలకు బోర్ కొట్టినప్పుడు వారు సొంతంగా ఏదైనా నేర్చుకోవాలి. కానీ ఆ ఖాళీని ఫోన్‌తో నింపడం వల్ల వారికి ఓర్పు నశిస్తోంది. ఫోన్ లాక్కున్న వెంటనే విపరీతమైన కోపం తెచ్చుకోవడం, వస్తువులను విసిరేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తమ భావోద్వేగాలను ఎలా అదుపు చేసుకోవాలో వారు నేర్చుకోలేకపోతున్నారు.
ఖాళీ సమయంలో పిల్లలు మట్టిలో ఆడటం, బొమ్మలు గీయడం వంటివి చేయాలి. కానీ నిరంతరం వీడియోలు చూడటం వల్ల వారి మెదడు ఆలోచించడం మానేస్తుంది. కేవలం స్క్రీన్‌పై వచ్చే రంగులు, శబ్దాలకు మాత్రమే వారు స్పందిస్తారు. దీనివల్ల వారిలో క్రియేటివిటీ పూర్తిగా నశించిపోతుంది.
పిల్లలను ఆడించడానికి ఫోన్‌ను ఒక సాధనంగా వాడకండి. పిల్లలకు బోర్ కొడితేనే వారు కొత్త ఆటలను కనిపెడతారు. వారి ఆలోచనలకు పదును పెట్టనివ్వండి. రోజులో కనీసం గంట సేపు ఫోన్లు పక్కన పెట్టి పిల్లలతో గడపండి. వారితో కలిసి చిన్న చిన్న ఇంటి పనులు చేయండి.
మీ బిడ్డ చేతిలో ఉన్న ఫోన్ కేవలం ఒక గ్యాడ్జెట్ మాత్రమే కాదు.. అది వారి మేధస్సును హరించే ఆయుధం అని గుర్తుంచుకోండి. ఇప్పటికైనా మేల్కొనకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
మరిన్ని లైఫ్ స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.